
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...
ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజా మోయబోతున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, ప్లేయర్‌గా, వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే తరుపున కొనసాగుతాడని ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్...
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 12 సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్... 11 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది. అత్యధికంగా 9 సార్లు ఫైనల్ ఆడి, నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచి, ఘోర పరాభవాన్ని చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 సీజన్‌లో అన్యూహ్యంగా కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ విజేతగా నిలిచింది...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సస్‌ఫుల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్‌గా 204 మ్యాచుల్లో 121 విజయాలు అందుకున్నాడు. 82 మ్యాచుల్లో ఓడగా, ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. ఐపీఎల్‌లో మాహీ విన్నింగ్ పర్సంటేజ్ 59.60గా ఉంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మాహీ, రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచాడు...
ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో మొదటి రిటెన్షన్‌గా రవీంద్ర జడేజాని రూ.16 కోట్లకు, రెండో రిటెన్షన్‌గా ఎమ్మెస్ ధోనీని రూ.12 కోట్లకు ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సమయంలో మాహీ, వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని, ఆ బాధ్యతలు జడేజాకి దక్కవచ్చని ప్రచారం జరిగింది. అయితే సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ బాధ్యతలను జడ్డూకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మాహీ...
చెన్నై సూపర్ కింగ్స్‌కి 2008 నుంచి ఇప్పటివరకూ ఎమ్మెస్ ధోనీయే కెప్టెన్‌గా ఉంటూ వచ్చాడు. మాహీ ఆడని 6 మ్యాచుల్లో సురేష్ రైనా సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడో కెప్టెన్‌గా నిలవబోతున్నాడు రవీంద్ర జడేజా...
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు తనకి ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అంటూ సంచలన ప్రకటన చేశాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలో కేకేఆర్ సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కి అప్పగిస్తున్నట్టు ప్రకటించాడు దినేశ్ కార్తీక్. ఇప్పుడు ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ, సారథ్య బాధ్యతలను జడేజాకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు...
ఐపీఎల్ 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా, 14 సీజన్ల తర్వాత (బ్యాన్ కారణంగా ఐపీఎల్ 2010 సీజన్‌లో ఆడలేదు) కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోబోతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా సూపర్ సక్సెస్ అందుకున్న జడేజా, సారథిగా సక్సెస్ అవుతాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది.