
వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సౌతాఫ్రికా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇప్పటికే ఆరుకి ఆరు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా, టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరితే, ప్లేఆఫ్స్ చేరిన రెండో జట్టుగా సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ నిలిచింది. మొదటి నాలుగు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న సౌతాఫ్రికా, ఐదో మ్యాచ్‌లో ఆసీస్ చేతుల్లో తొలి పరాజయాన్ని చవి చూసింది...
వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్, సౌతాఫ్రికాకు కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి, బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్, 10.5 ఓవర్లలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. లీజెల్లీ లీ 9, లోరా వాల్వర్డ్ 3, తజ్మీన్ బ్రిట్స్ 1, కెప్టెన్ సునే లూజ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. దీంతో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...
ఈ దశలో మిగ్నాన్ డు ప్రీజ్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి సఫారీ టీమ్‌ను ఆదుకుంది. ఆమెతో పాటు మరిజాన్నే క్యాప్ 5 పరుగులతో క్రీజులో ఉంది. ఈ దశలో కుండపోత వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు అంపైర్లు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ కొనసాగించడం కష్టమేనని తేల్చి.. వెస్టిండీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు...
దీంతో ఇరుజట్లకీ చెరో పాయింట్ దక్కింది. ఆరు మ్యాచుల్లో 9 పాయింట్లు దక్కించుకున్న సౌతాఫ్రికా సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 7 మ్యాచుల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సంపాదించిన వెస్టిండీస్, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది...
సౌతాఫ్రికా టాపార్డర్ అప్పటికే పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో విండీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షం కారణంగా సౌతాఫ్రికా లక్కీగా ప్లేఆఫ్స్ చేరగా, వెస్టిండీస్, భారత జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ మహిళా జట్టు, ప్రస్తుతం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది...
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనుంది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్‌కి బంగ్లాని ఓడించడంలోనూ పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు. అదే జరిగితే ఇంగ్లాండ్ 8 పాయింట్లతో సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది...
మరో ప్లేఆఫ్స్ బెర్త్‌ను సౌతాఫ్రికా- టీమిండియా మధ్య మార్చి 27న జరిగే మ్యాచ్ ఫలితం డిసైడ్ చేయనుంది. టీమిండియా ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. లేదంటే టీమిండియా కంటే ఒక్క పాయింట్ అధికంగా సాధించిన వెస్టిండీస్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. లేదా సఫారీ జట్టుకి లక్ కలిసి వచ్చినట్టే, ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే... నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున భారత మహిళా జట్టు ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్తుంది...
ఒకవేళ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయి, భారత జట్టు కూడా సఫారీ టీమ్ చేతుల్లో ఓడితే... ఇరు జట్ల నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ చేరే జట్టును నిర్ణయించాల్సి ఉంటుంది.