భాగ్యనగరంలో ధోని క్రికెట్ అకాడమీ.. నాచారంలో నెలాఖరు నుంచే ఆట షురూ..

Published : Feb 04, 2022, 07:46 PM IST
భాగ్యనగరంలో ధోని క్రికెట్ అకాడమీ..  నాచారంలో నెలాఖరు నుంచే ఆట షురూ..

సారాంశం

MS Dhoni Cricket Academy in Hyderabad: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని  మార్గనిర్దేశనంలో నడుస్తున్న ధోని అకాడమీ హైదరాబాద్ లో ఏర్పాటైంది. నాచారంలోని..

భారత క్రికెట్ జట్టుకు రెండు ప్రపంచకప్పులను అందించిన మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా  వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని మార్గదర్శకత్వంలో ఎంతో మంది యువ క్రికెటర్లు ఆటలో మెలుకువలు నేర్చుకోవాలని భావిస్తారు. ధోని సూచనలతో నడిచే  అకాడమీలో చేరేందుకు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్  ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల  కలలు నిజమయ్యే తరుణం రానే వచ్చింది. ధోని మార్గనిర్దేశనంలో నడుస్తున్న మహేంద్ర సింగ్ ధోని అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) మన హైదరాబాద్ కు కూడా వచ్చింది. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ లో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమానికి  తెలంగాణ  కార్మిక శాఖ మంత్రి  చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత మంత్రి సమక్షంలో ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నాచారం, పల్లవి విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్కా కొమరయ్య, మిహిర్‌ దివాకర్‌ మార్చుకున్నారు. 

అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ..

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీసీఏ ఏర్పాటుకు చొరవ తీసుకున్న‌ కొమరయ్యను మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎంఎస్‌డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోని వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని ఆకాంక్షించారు. ధనాధన్‌ బ్యాటింగ్‌, బాధ్యతయుతమైన నాయకత్వంతో మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా విశిష్ఠ పేరు ప్రఖ్యాతులు గడించిన ధోనీ వెంచ‌ర్‌లోని ఎంఎస్‌డీసీఏ క్రికెట్‌ అకాడమీని హైద‌రాబాద్‌లో ప్రారంభిస్తుండటం గొప్ప విషయమని మల్లారెడ్డి కొనియాడారు. 

మెరుగైన శిక్షణ అందించేందుకే.. : మిహిర్‌ 

క్రికెటర్‌ కావాలనే ఆశయమున్న పిల్లలు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఏకైక ఉద్దేశంతో ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్‌ చెప్పారు. దేశంలోని ప్రతిభ గల క్రికెటర్లకు ప్రణాళికబద్దమైన శిక్షణ అందించాలనేది తమ అభిమతమని అన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పల్లవి, డీపీఎస్‌ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ‘తొలిద‌శ‌లో భాగంగా ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ నాచారంలో ఈ నెలాఖ‌రు నుంచి శిక్ష‌ణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. డీపీఎస్ నాద‌ర్‌గుల్, ప‌ల్ల‌వి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్ గండిపేట‌, బోడుప్ప‌ల్ శాఖ‌ల‌లో వచ్చే నెలలో అకాడమీలు తెరవనున్నాం. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అకాడమీలు తెరిచే ఆలోచనలు ఉన్నాయ’ని చెప్పారు.

‘అకాడమీ పనితీరు విషయానికొస్తే నిబద్ధత, విలువలతో కూడిన శిక్షణ, సమష్ఠి కృషి, ఆటను ఆస్వాదించడం, కొత్త విషయాలను అన్వయించుకోవడమనే సూత్రాల‌ ఆధారంగా ఎంఎస్‌డీసీఏ శిక్షణ ఉంటుంది. నిష్ణాతులైన కోచ్‌లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని భావి, వర్ధమాన క్రికెటర్లకు చేరువ చేయాలని మిషన్‌తో ఎంఎస్‌డీసీఏ పనిచేస్తోంది. ఎంఎస్‌డీసీఏ కోచింగ్‌ మాడ్యూల్‌ను ధోనీ సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తుంటాం. ధోని అనుమతి తీసుకున్నాకే కోచింగ్‌ మాడ్యూల్‌ను అకాడమీల్లో ప్రవేశపెడతాం’ అని మిహిర్‌ వివరించారు.

అందుకే ధోనీతో ఒప్పందం : కొమరయ్య

విద్యతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల అభిరుచికి సముచిత స్థానమివ్వాలనేది తమ విద్యాసంస్థల ప్రథమ లక్ష్యమని పల్లవి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (నాచారం) చైర్మన్‌ మల్కా కొమరయ్య అన్నారు. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ ప్లేయర్లు సుమిత్‌-సిక్కి రెడ్డి, రోలర్‌ స్కేటింగ్‌లో అనూప్‌ యమ, షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌ తమ విద్యాసంస్థల్లో ఇప్పటికే అకాడమీలను నడుపుతున్నారని తెలిపారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో తమ విద్యాసంస్థలో క్రికెట్‌ అకాడమీలనూ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ధోని క్రికెట్‌ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)తో ఒప్పందం చేసుకున్నామని కొమరయ్య వెల్లడించారు. 

‘ఆర్కా సంస్థ ఆధ్వర్యంలో ఈ అకాడమీ కార్యకలాపాలు జరగనున్నాయి. ప్రతిభ, ఆసక్తి, క్రికెటర్‌ కావాలనే బలమైన ఆకాంక్ష గల పిల్లలకు ‘ఎంఎస్‌డీసీఏ’ ఒక అద్భుతమైన వేదిక. ఈ సువర్ణావకాశాన్ని విద్యార్థులు ఒడిసి పట్టుకోవాలి’ అని కొమరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ ఎంఎల్‌ఏ సుభాష్‌ రెడ్డి, పల్లవి విద్యాసంస్థల సీఓఓ మల్కా యశస్వి, ఎంఎస్‌డీసీఏ ప్రతినిధులు సిఖిందర్‌, ఉమా శంకర్‌, రాబిన్‌, కోచ్‌లు సత్రజిత్‌ లహరి, వెంకట్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !