అతడిని ఆసీస్ కెప్టెన్ చేయాలి.. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

By team teluguFirst Published Nov 21, 2021, 6:51 PM IST
Highlights

Ashes: తన సహోద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో నాయకత్వ బాధ్యతల నుంచి ఆసీస్ సారథి టిమ్ పైన్ వైదొలగగా.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా.? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్ ముందు ఆస్ట్రేలియా (Australia) టెస్టు జట్టు  సారథి టిమ్ పైన్ (Tim Paine) అనూహ్య రీతిలో సారథ్య  బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కంగారూలను నడిపించే నాయకుడి కోసం  ఆ దేశ క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతున్నది. ఈ జాబితాలో ఇద్దరు క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇంకా దీనిమీద  తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ (England) స్టార్ బౌలర్.. జేమ్స్ అండర్సన్ (James Anderson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే యాషెస్ సిరీస్ కోసం ఆసీస్ జట్టు కెప్టెన్ గా బౌలర్ పాట్ కమిన్స్ ను నియమించాలని అన్నాడు. అలా చేస్తే మరికొన్ని జట్లు కూడా  బౌలర్లను సారథులుగా చేసే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. 

అండర్సన్ మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో చాలా మంది బౌలర్లు సారథులు కావాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయమేమిటంటే..  కెప్టెన్ గా ఉంటే మనం ఆటతో పాటు అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ బౌలర్ గా ఉంటే మన పని మనం సక్రమంగా చేస్తే చాలు. ఇక  ఆసీస్  సారథిగా గురించి చెప్పాలంటే.. నేనైతే  Pat Cummins సారథి కావాలని కోరుకుంటున్నాను. అతడు ఆ జట్టు బౌలింగ్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఆసీస్ క్రికెట్ టెస్టు జట్టుకు నాయకుడిగా అతడిని ఎంపిక చేస్తే బావుంటుందని నేను భావిస్తున్నాను.. బౌలర్ గానే గాక నాయకుడిగా కూడా జట్టును నడిపించే సామర్థ్యం అతడిలో ఉన్నాయి.. ’ అని అండర్సన్ అన్నాడు. 

Also Read: Tim Paine: యాషెస్ కు ముందు ఆసీస్ కు భారీ దెబ్బ.. టిమ్ పైన్ రాజీనామా.. తర్వాత సారథి ఎవరు..?

ఇంకా అండర్సన్  స్పందిస్తూ.. ‘కెప్టెన్ గా బౌలర్ సరిపోతాడా..? లేదా..? అనేదానిమీద భిన్న వాదనలున్నాయి. కానీ అవేవీ  నిజమైనవి కావు.  మాములుగా కెప్టెన్లు అంటే స్లిప్స్ లో ఉంటూ ఫీల్డ్ పొజిషన్లు, బౌలర్లను మార్చడం వంటివి చేస్తారు. నేను కూడా అది చేయగలను..’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు అండర్సన్.

ఇక ఇదే విషయమై ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne) కూడా స్పందించాడు. తనవరకైతే పాట్ కమిన్స్ ఆసీస్ సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఓ ఆస్ట్రేలియన్ పత్రికకు వార్న్ వ్యాసం రాస్తూ.. ‘నా వరకైతే  ఆసీస్ సారథిగా పాట్ కమిన్స్ అయితే  బావుంటుందని నమ్ముతున్నాను. ఇదే విషయాన్ని నేను ఇదివరకే చెప్పాను. ఆసీస్  నాయకుడిగా కమిన్స్ ను ప్రకటించడానికి ఇంతకంటే సరైన సమయం మరోకటి లేదు..’ అని అభిప్రాయపడ్డాడు. 

కాగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టులో కొనసాగుతానని టిమ్ పైన్ చెబుతుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అతడికి పూర్తి స్థాయిలో ఉద్వాసన పలకాలని చూస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆసీస్  మరో వికెట్ కీపర్ ను వెతకాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ లో అదరగొట్టిన  మాథ్యూ వేడ్  ను గానీ అలెక్స్ కేరీని గానీ ఎంపికచేయాలని వార్న్ కోరాడు. ఇదే సమయంలో టిమ్ పైన్ ఉదంతం పై కూడా వార్న్ స్పందించాడు. 

‘ఈ ఘటనకు సంబంధించి నేనేమీ అతడి (పైన్) ను వెనకేసుకురావడం లేదు. పైన్ పబ్లిక్ ఫిగర్ అవడం వల్ల  అందరూ ఈ విషయాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ఆ హోదాలో ఉన్నంత మాత్రానాా అతడు తప్పు చేయకూడదని లేదు కదా. క్రీడాకారులు కూడా మనుషులే. వాళ్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. దీనిపై తీర్పులివ్వడం మానేయండి. అది మన చేతుల్లో లేదు..’ అంటూ వార్న్ రాసుకొచ్చాడు. 

click me!