
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల్లో తొమ్మిది సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమైన చెత్త రికార్డును సాధించాడు. అలాగే, ఈ విషయంలో మాజీ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనాతో సమానంగా నిలిచారు. ఇదివరకు రైనా నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయిన ప్లేయర్ గా ఉన్నాడు.
ఈ జాబితాలో అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్ లాంటి బ్యాట్స్‌మెన్లు కూడా ఉన్నారు. వీరిద్దరు ఏడు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యారు. నాకౌట్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడి కారణంగా టాప్ ప్లేయర్లు ప్రభావితం అవుతుంటారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ 7 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇది స్టోయినిస్‌కు ఈ సీజన్‌లో తొలి వికెట్ కావడం గమనార్హం. ఇది రోహిత్‌కు నాకౌట్ మ్యాచ్‌ల్లో తొమ్మిదవ సింగిల్ డిజిట్ అవుట్.
రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు
కాగా, మునుపటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 49 బంతుల్లో 80 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ స్కోరును 228/5కి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్ ముంబై విజయానికి బలమైన పునాది వేసింది.
పంజాబ్ తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 203/6 పరుగులుచేసింది. జానీ బెయిర్ స్టో 38, తిలక్ వర్మ 44, సూర్య కుమార్ యాదవ్ 44, నమన్ ధీర్ 37 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.