KFC Big Bash League: వికెట్ తీశాక చేతులు కడుక్కుని.. మాస్కు ధరించి.. పాకిస్థాన్ పేసర్ వెరైటీ సెలబ్రేషన్స్

By Srinivas MFirst Published Jan 11, 2022, 12:11 PM IST
Highlights

Haris Rauf:  క్రికెట్లో బౌలర్లు వికెట్లు తీసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ పాకిస్థాన్ పేసర్ మాత్రం ప్రజలకు ఉపయోగపడే పని చేశాడు. 

క్రికెట్ లో వికెట్ తీశాక ఒక్కో బౌలర్ ది ఒక్కో రకమైన సెలబ్రేషన్. ఇటీవలి కాలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. వికెట్ పడ్డాక ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్ స్టైల్ ను కాపీ కొట్టాడు.  అయితే ఈ  పాకిస్థాన్ ఆటగాడు మాత్రం  కొత్త తరహా వేడుకలు చేసుకున్నాడు. వికెట్ తీసిన వెంటనే కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ వెరైటీ గా జరుపుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న హరీస్ రౌఫ్.. వికెట్ తీయగానే శానిటైజర్ తీసి చేతికి పూసుకున్నట్టు చేసి జేబులో ఉన్న మాస్కును ధరించాడు.

బిగ్ బాష్ లీగ్ 2021-22లో భాగంగా భాగంగా మెల్బోర్న్ స్టార్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రౌఫ్..  పెర్త్ స్కాచర్స్ తో జరిగిన మ్యాచులో వికెట్ పడగొట్టగానే వినూత్న రీతిలో వేడుకలు జరుపుకున్నాడు.  ఈ  మ్యాచులో పెర్త్ స్కాచర్స్ జట్టు..  తొలిరెండు ఓవర్లలోనే 21 పరుగులు సాధించింది. మూడో ఓవర్లో రౌఫ్ బౌలింగ్ కు వచ్చాడు. 

 

"Cleanly" taken for Haris Rauf's first wicket of the day... 😷🧼 | pic.twitter.com/hLWA0XXoth

— KFC Big Bash League (@BBL)

రౌఫ్ బౌలింగ్ లో పీటర్సన్.. వికెట్ కీపర్ కు జోయ్ క్లార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఈ క్రమంలో రౌఫ్.. కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసే విధంగా.. శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకుని, మాస్క్ ధరించాడు. ఇలా చేసి ప్రజలకు కరోనా మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పకనే చెప్పాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రౌఫ్ కంటే ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ కూడా ఇలాంటి వేడుకలనే జరుపుకున్నాడు.  

ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ దేశాలు మరోసారి కరోనా తో గజగజ వణుకుతున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ తో మళ్లీ ప్రపంచం అతలాకుతలమవుతున్నది.  భారత్ లో కూడా థర్డ్ వేవ్ ప్రారంభమై.. కేసుల సంఖ్య నానాటికీ విజృంభిస్తున్నాయి. దీంతో  ప్రజలు బయటకెళ్తే తప్పక మాస్కులు ధరించాలని, కరోనా మార్గదర్శకాలను పాటించాలని పదే పదే సూచిస్తున్నది. 

ఇక ఈ  మ్యాచులో   మొదట బ్యాటింగ్  చేసిన పెర్త్ స్కాచర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది.  ఆ జట్టు తరఫున ఎవాన్స్ (69),  టర్నర్ (47) టాప్ స్కోరర్స్ గా ఉన్నారు.  కాగా.. పాకిస్థాన్ కు చెందిన రౌఫ్.. 2019లో  పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లో అదరగొట్టాడు. ఆ సీజన్ లో లాహోర్ కలండర్స్ తరఫున ఆడిన అతడు.. అందులో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో బిగ్ బాష్ లీగ్ లో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవలే దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  పాకిస్థాన్ తరఫున ఆడిన అతడు.. షార్జాలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

click me!