
క్రికెట్ చట్టాల సంరక్షకుడిగా వ్యవహరించే మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్ (ఎంసీసీ) కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. క్రికెట్ లో కొన్ని నిబంధనలలో మార్పులతో పాటు పలు వివాదాస్పద అంశాల మీద శాశ్వత నిషేధం విధించేందుకు యోచిస్తున్నది. ఇందులో ముఖ్యంగా మన్కడింగ్ (నాన్ స్ట్రైకర్ బ్యాటర్ రనౌట్), సలైవా పై నిషేధం వంటివి ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లో వీటిని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన కీలక విషయాలన్నీ త్వరలోనే బహిర్గతమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
క్రికెట్ లో మన్కడింగ్ వివాదం ఇప్పటిది కాదు. ఇది సమర్థనీయమే అని కొంతమంది వాదిస్తుండగా.. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో ఎంసీసీ కొత్త రూల్స్ తో రానున్నది. కొత్త నిబంధనలివే...
మన్కడింగ్ పై నిషేధం..
ఒక బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటితే సదరు బౌలర్ అతడిని ఔట్ చేసే అవకాశముంది. దానిని మన్కడింగ్ గా పరిగణిస్తారు. అసలు మన్కడింగ్ గురించి చరిత్రలోకి వెళ్తే... 1948లో భారత క్రికెటర్ విను మన్కడ్ ఆసీస్ వికెట్ కీపర్ బిల్ బ్రౌన్ ను ఇదే తీరులో ఔట్ చేశాడు. దీంతో ఆ ఔట్ ను ఆస్ట్రేలియా మీడియా ‘మన్కడింగ్ ఔట్’ అని పిలిచింది. అప్పట్నుంచి ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ గా పిలుస్తున్నారు. అయితే దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిలవడం ద్వారా విను మన్కడ్ పేరు, ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఆయన ఆవేదన.
ఇదిలాఉండగా.. మన్కడింగ్ ఔట్ ను త్వరలో శాశ్వతంగా నిషేధించనున్నట్టు ఎంసీసీ తెలిపింది. అది క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ఉందని.. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న ఏ బ్యాటర్ అయినా పరుగు తీయడం కోసం సిద్ధంగా ఉంటాడని, అందులో భాగంగా క్రీజు దాటే అవకాశముందని తెలిపింది. ఇకపై బౌలర్ మన్కడింగ్ చేసే అవకాశం లేదని, క్రికెట్ నిబంధనల్లో భాగంగా లా -41 (క్రీడా స్ఫూర్తికి విరుద్ధం).. లా -38 (రనౌట్) ప్రకారం మన్కడింగ్ ను రూల్స్ నుంచి తొలగించారు.
కొత్త బ్యాటర్ బ్యాట్ పట్టాల్సిందే...
మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు సంబంధించి అతడు ఎక్కడ ఉండాలనే దానిమీద కూడా ఎంసీసీ నిబంధనల్లో చిన్న మార్పు చేసింది. ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందు ఇద్దరు బ్యాటర్లు క్రీజులో ఒకరినొకరు దాటితే ఇకపై క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్ వైపునకు వెళ్లాలి. ఇంతకుముందు ఏ బ్యాటర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చే బ్యాటర్ నాన్ స్ట్రైక్ ఎండ్ కు వెళ్లాలనే నిబంధన ఉండేది.
లాలా జలం పై నిషేధం..
క్రికెట్ లో బంతిని షైన్ చేసేందుకు బౌలర్లు బంతికి సలైవా (లాలాజలం) ఉపయోగించకూడదని కరోనా సందర్భంగానే ఎంసీసీ పేర్కొంది. ఇక తాజాగా ఎంసీసీ చేపట్టిన పరిశోధనలో బౌలర్లు స్వింగ్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యంపై కూడా ఇది (సలైవా) ప్రభావం చూపుతుందని తేలింది. దీంతో బౌలర్లు సలైవాను వాడకూడదని తేలింది. అంతర్జాతీయ క్రికెట్ లో సలైవాను ఉపయోగించడం ఇప్పటికే నిషిద్ధం.
వీటితో పాటు వైడ్ కు సంబంధించిన నిబంధనలో కూడా ఎంసీసీ చిన్న మార్పులు చేసింది. స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ నిల్చున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించే విధంగా కొత్త రూల్ ను తీసుకురానుంది. డెడ్ బాల్స్ తో పాటు కట్ స్ట్రిప్ దాటిన బతిని బ్యాటర్ టచ్ చేసే విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది.