
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో వెస్టిండీస్ జట్టు అదరగొట్టే ప్రదర్శనలతో ముందుకు సాగుతున్నది. డిఫెండింగ్ ఛాంపియన్లు ఇంగ్లాండ్ కు గట్టి షాకిచ్చింది. బుధవారం డునెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఏడో గ్రూప్ మ్యాచులో విండీస్ మహిళల జట్టు.. ఇంగ్లాండ్ ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడినా.. విజయం మాత్రం విండీస్ నే వరించింది. టోర్నీలో విండీస్ కు ఇది వరుసగా రెండో విజయం కాగా డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు మాత్రం వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచులో ఇంగ్లాండ్.. ఆసీస్ చేతిలో ఓడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వెస్టిండీస్ సారథి నమ్మకాన్ని ఓపెనర్లు డాటిన్ (31), మాథ్యూస్ (45) లు వమ్ము చేయలేదు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే 58 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్న మాథ్యూస్ తో పాటు డాటిన్ ఇద్దరూ ఒకే ఓవర్లో వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్ ఎక్లెస్టోన్ విండీస్ 20 వ ఓవర్లో.. మాథ్యూస్ ను ఔట్ చేయగా, డాటిన్ రనౌట్ రూపంలో వెనుదిరిగింది.
ఈ ఇద్దరి నిష్క్రమణ అనంతరం వచ్చిన కైకియ నైట్ (6), కెప్టెన్ ఎస్.టేలర్ (0) లు కూడా ఎక్లెస్టోన్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు. దీంతో అప్పటిదాకా బాగానే ఆడిన విండీస్ ఒక్కసారిగా.. 98 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో వికెట్ కీపర్ ఎస్. క్యాంప్బెల్లీ (66), చెడీన్ నేషన్ (49) లు రాణించారు. ఈ ఇద్దరూ కలిసి అభేద్యమైన ఐదో వికెట్ కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో విండీస్.. 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ (12) ను షమిలియా ఔట్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్.. కెప్టెెన్ హెదర్ నైట్ (5), నటాలీ సీవర్ (2), ఎమీ ఎలెన్ జోన్స్ (1) లు కూడా త్వరగానే నిష్క్రమించారు. దీంతో ఇంగ్లాండ్ 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో ఓపెనర్ టామీ బీమౌంట్ (46) కాసేపు ప్రతిఘటించింది. ఆమెకు డానియల్ వియాట్ (33) జత కలిసింది. ఇద్దరూ కలిసి కాసేపు విండీస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. కానీ ఇన్నింగ్స్ 26వ ఓవర్లో మహ్మద్ వేసిన బంతితో ఆమె ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. కానీ వియాట్ మాత్రం సోఫియా డంక్లీ (38) కాసేపు పోరాడింది. కానీ టేలర్ బౌలింగ్ లో డంక్లీ నిష్క్రమించింది. ఆ తర్వాత వచ్చిన బ్రంట్ (1) కూడా వెనుదిరిగింది. దీంతో ఇంగ్లాండ్ 34 ఓవర్లోనే 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కానీ చివర్లో వచ్చిన ఎక్లెస్టోన్ (33 నాటౌట్)... కేట్ క్రాస్ (27) తో కలిసి పోరాడింది. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చడానికి సకల ప్రయత్నం చేశారు. అయితే 47వ ఓవర్లో.. కేట్ క్రాస్ రనౌట్ గా వెనుదిరిగింది. అప్పటికీ స్కోరు 217-9. విజయానికి మరో ఏడు పరుగులు కావాల్సి ఉంది. ఎక్లెస్టోన్ మీద ఆశలున్నా... చివరి వికెట్ గా వచ్చిన అన్య శ్రుబ్సోల్ (0) ను మహ్మద్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఏడు పరుగుల తేడాతో విండీస్ ను విజయం వరించింది. విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాంప్బెల్లికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.