డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్... టీమిండియాలోకి రీఎంట్రీ సాధ్యమేనా..

By Chinthakindhi RamuFirst Published Feb 9, 2023, 3:37 PM IST
Highlights

రంజీ ట్రోఫీ 2022-23 సెమీ ఫైనల్‌లో సౌరాష్ట్రతో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్.. 249 వద్ద రనౌట్ అయిన మయాంక్.. 

ఓ వైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా తలబడుతుంటే మరోవైపు రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో కర్ణాటక జట్టు, సౌరాష్ట్రతో... మరో సెమీస్‌లో మధ్యప్రదేశ్ జట్టు, బెంగాల్‌తో తలబడుతున్నాయి...

సౌరాష్ట్రతో సెమీ ఫైనల్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 429 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 249 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. సమర్థ్ 3, దేవ్‌దత్ పడిక్కల్ 9, మనీశ్ పాండే 7, శ్రేయాస్ గోపాల్ 15, కృష్ణప్ప గౌతమ్ 2 పరుగులు చేసి నిరాశపరిచారు. వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ 66 పరుగులు చేశాడు...

249 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, ఆఖరి వికెట్‌గా రనౌట్ కావడంతో కర్ణాటక జట్టు 407 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదీప్ గరామీ 112, మజుందర్ 120 పరుగులతో సెంచరీలు బాదాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది బెంగాల్.. 

 
ఒకే ఒక్క సిరీస్, పృథ్వీ షాతో పాటు మయాంక్ అగర్వాల్ కెరీర్‌ని తలకిందులు చేసేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో టీమిండియా ఓపెనర్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ కారణంగా తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది..

ఆడిలైడ్ టెస్టులో పృథ్వీ షాతో ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్, మెల్‌బోర్న్ టెస్టులో శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేశాడు. రెండు టెస్టుల్లోనూ మయాంక్ అగర్వాల్ బ్యాటు నుంచి మెరుపులు రాకపోవడంతో సిడ్నీ టెస్టులో అతన్ని ఆడించలేదు టీమిండియా. 

హనుమ విహారి, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు గాయపడడంతో బ్రిస్బేన్ టెస్టులో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన మయంక్ అగర్వాల్... శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా సెటిల్ కావడంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు...

శుబ్‌మన్ గిల్ గాయపడడంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి మయాంక్ అగర్వాల్‌నే ఓపెనర్‌గా ఎంపిక చేసింది టీమిండియా. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు మయాంక్ అగర్వాల్ తలకు బలంగా గాయం కావడంతో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు...

మూడేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, సెంచరీతో టీమ్‌లో సెటిల్ అయిపోయాడు. దీంతో శుబ్‌మన్ గిల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ కూడా టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడిన మయాంక్ అగర్వాల్ 160 పరుగులు చేసి మెప్పించాడు. అయితే టీమ్‌లో ప్లేస్ మాత్రం ఫిక్స్ చేసుకోలేకపోయాడు మయాంక్...

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో 79.6 సగటుతో 796 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, టీమిండియాలో చోటు ఆశించడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే కెఎల్ రాహుల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు గాయపడడం, లేదా ఘోరంగా ఫెయిల్ అవ్వడం జరిగితేనే టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మయాంక్ అగర్వాల్‌కి సెలక్టర్ల నుంచి మరోసారి పిలుపు రావచ్చు.

click me!