ఐదేసిన జడ్డూ, మూడు వికెట్లు తీసిన అశ్విన్... రెండు సెషన్లలోనే ఆస్ట్రేలియా ఆలౌట్...

By Chinthakindhi RamuFirst Published Feb 9, 2023, 2:50 PM IST
Highlights

India vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 177 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా... 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, 3 వికెట్లు తీసిన అశ్విన్.. 

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 10 రోజుల ముందే ఇండియాకి వచ్చి, భారత స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా పెట్టుకుని ప్రాక్టీస్ చేసిన ఆసీస్ బ్యాటర్లు కనీసం మూడు సెషన్ల పాటు పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. 

ఆరు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జడేజా 5 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయడంతో 63.5 ఓవర్లలో 177 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆసీస్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. 2.1 ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది టీమిండియా. రెండో ఓవర్ మొదటి బంతికి మహ్మద్ సిరాజ్, ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేయగా, మూడో ఓవర్ తొలి బంతికి డేవిడ్ వార్నర్‌కి క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...

మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్, తొలి బంతికి ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూకి టీమిండియా అప్పీలు చేసినా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఏడో బంతికే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్న టీమిండియా, కావాల్సిన ఫలితం రాబట్టింది.

టీవీ రిప్లైలో బంతికి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో ఉస్మాన్ ఖవాజా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.. అయితే మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.. 123 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ చేసిన శ్రీకర్ భరత్, టీమిండియాకి కావాల్సిన బ్రేక్ అందించాడు...

ఆ తర్వాతి బంతికి మ్యాట్ రెంషోని గోల్డెన్ డకౌట్ చేశాడు రవీంద్ర జడేజా. దీంతో 84 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 107 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా...

109 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ దశలో అలెక్స్ క్యారీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ కలిసి ఆరో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 33 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, టెస్టుల్లో 450 వికెట్లు పూర్తి చేసుకున్నాడు...

14 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టాడ్ ముర్ఫీని డకౌట్ చేశాడు జడేజా...

click me!