
భారత్‌లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులకు గాను టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించే సంస్థ మారింది. 2015 నుంచి బీసీసీఐతో కొనసాగుతున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సేవా సంస్థ పేటీఎం ఆ ‘బరువు’ను దించుకుంది. పేటీఎం స్థానంలో బీసీసీఐ.. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ను బరిలోకి దింపింది. పేటీఎం అభ్యర్థన మేరకు ‘బదిలీ ఒప్పందం’కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజా ఒప్పందంతో మాస్టర్ కార్డ్ ఇకనుంచి భారత అంతర్జాతీయ మ్యాచులతో పాటు దేశవాళీ మ్యాచులకూ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. సెప్టెంబర్ నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. టీమిండియాకు మాస్టర్ కార్డ్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించబోయే తొలి సిరీస్ ఇదే కానున్నది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. దక్షిణాఫ్రికాతో కూడా 3 టీ20లు ఆడల్సి ఉంది.
2015 లో పేటీఎం బీసీసీఐతో నాలుగేండ్లకు రూ. 203 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2019లో ఆ ఒప్పందాన్ని పునరుద్దరించుకుంది. ఈ డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు. ఒప్పందం ప్రకారం పేటీఎం 2023 వరకు కొనసాగాలి. కానీ పేటీఎం మాత్రం మరో ఏడాది బాకీ ఉండగానే టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడం అనుమానాలకు తావిస్తున్నది.
ఇటీవలే ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో పేటీఎం.. తాము టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటామని, తమ ఒప్పందాన్ని మాస్టర్ కార్డ్ కు మార్చాలని అభ్యర్థన పెట్టుకున్న విషయం తెలిసిందే. పేటీఎం కోరిన విధంగానే బీసీసీఐ.. వాటిని మాస్టర్ కార్డ్ కు మళ్లించేందకు ఒప్పుకుంది. అయితే దీనికి సంబంధించి ట్రాన్స్‌ఫర్ కాంట్రాక్ట్ కూడా పూర్తైందని, ఆగస్ట్ మొదటి వారంలో పేటీఎంతో ఒప్పందాలు ఉంటాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
పేటీఎం కథ ఇది..
- 2015లో పేటీఎం తొలిసారి టైటిల్ స్పాన్సర్ గా ఫీల్డ్ లోకి వచ్చింది.
- 2019లో ఈ డీల్ ను నాలుగేండ్ల పాటు పునరుద్దరించుకుంది.
- డీల్ ఒప్పందం రూ. 326.80 కోట్లు.ఒప్పందం ప్రకారం 2023 వరకు కొనసాగాలి.
- 2019 వరకు మ్యాచ్ కు రూ. 2.4 కోట్ల ఉన్న విలువను 2019 తర్వాత రూ. 3.80 కోట్లకు పెంచి మరీ హక్కులు దక్కించుకున్న పేటీఎం అర్థాంతరంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని ప్రతిపాదించడం గమనార్హం.