
జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు.. ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆల్ రౌండర్లకు లెక్కలేదు. ప్రపంచ స్థాయి బౌలర్లు, అగ్రశ్రేణి బ్యాటర్లు.. ఫీల్డింగ్ గురించైతే చెప్పాల్సిన పన్లేదు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు సఫారీలకు మాత్రం ఇంతవరకూ ఐసీసీ టోర్నీలలో టైటిల్ నెగ్గే భాగ్యం రాలేదు. వన్డే ప్రపంచకప్ లలో ఆ జట్టును దురదృష్టానికి కేరాప్ అడ్రస్ గా పేర్కొంటారు క్రికెట్ పండితులు. కానీ ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోయినా సౌతాఫ్రికా మాత్రం కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఒకే ఒక్కసారి నిర్వహించిన క్రికెట్ పోటీలలో స్వర్ణం నెగ్గిందనే విషయం ఎంతమందికి తెలుసు..?
ఐసీసీ టోర్నీలలో అట్టర్ ఫ్లాప్ అయిన దక్షిణాఫ్రికా.. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి నిర్వహించిన క్రికెట్ పోటీలలో స్వర్ణం గెలిచింది. 1998లో కౌలాలంపూర్ (మలేషియా) వేదికగా జరిగిన క్రీడల (వీటి తర్వాత మళ్లీ 2022లోనే నిర్వహిస్తున్నారు)లో స్వర్ణ పతకం నెగ్గింది సౌతాఫ్రికానే. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికా..
- 1992 వన్డే ప్రపంచకప్ లో తొలిసారిగా ఐసీసీ టోర్నీలు ఆడటం మొదలుపెట్టింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడింది.
- 1996 వరల్డ్ కప్ లో ప్రొటీస్ జట్టు క్వార్టర్స్ లోనే నిష్క్రమించింది. గ్రూప్ స్టేజ్ లో గ్రూప్ టాపర్లుగా ఉన్న సఫారీలు.. క్వార్టర్స్ లో వెస్టిండీస్ చేతిలో ఓడారు.
- 1999 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా గ్రూప్ స్టేజ్ లో టేబుల్ టాపర్స్ గా నిలిచింది. దీంతో సూపర్ సిక్స్ కు ఎంట్రీ ఇచ్చింది. సెమీస్ లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’ అయింది. నెట్ రన్ రేట్ కారణంగా ఆసీస్ ఫైనల్స్ కు వెళ్లింది. సఫారీల గుండె పగిలింది.
- 2003 వన్డే వరల్డ్ కప్ సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వేలలో జరిగింది. కానీ సొంత గడ్డపై సౌతాఫ్రికా గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగింది. ఇది ఆ జట్టు చరిత్రలో ఓ పీడకలగా మిగిలింది.
- వెస్టిండీస్ లో జరిగిన 2007 ప్రపంచకప్ లో సెమీఫైనల్స్ కు వెళ్లిన సఫారీలు.. సెమీస్ లో ఆసీస్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు.
- భారత్ లో నిర్వహించిన 2011 ప్రపంచకప్ లో సఫారీలు క్వార్టర్స్ లోనే వెనుదిరిగారు. కివీస్ చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది.
- 2015 లో కూడా సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది.
- ఇంగ్లాండ్ లో జరిగిన 2019 ప్రంపచకప్ దక్షిణాఫ్రికా చరిత్రలోనే అత్యంత దరిద్రమైన ప్రదర్శనగా ఆ దేశపు అభిమానులు చెప్పుకుంటారు. ఈ టోర్నీలో ఆ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది.
టీ20లలో..
50 ఓవర్ల ఫార్మాట్ ఇలా ఉంటే పొట్టి ఫార్మాట్ లో కూడా దక్షిణాఫ్రికాకు కలిసిరాలేదు. వాళ్ల దేశంలోనే జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ లో రెండో రౌండ్ లోనే నిష్క్రమించిన సఫారీలు.. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. 2009, 2014లో సెమీస్ చేరడం మినహా 2010, 2012, 2016, 2021లలో గ్రూప్ స్టేజ్ లోనే వెనుదిరిగింది.
కామన్వెల్త్‌లో కింగులు..
ఐసీసీ టోర్నీలలో విఫలమైన దక్షిణాఫ్రికా మాత్రం కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించింది. 24 ఏండ్ల క్రితం జరిగిన ఈ పోటీలలో 16 దేశాలు పాల్గొన్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్ లో ముగిసిన ఈ క్రీడలలో.. ఐసీసీ టోర్నీలలో దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే సౌతాఫ్రికా స్వర్ణం సాధించింది. ఫైనల్ లో ఆస్ట్రేలియా ను ఓడించి బంగారు పతకాన్ని ముద్దాడింది. ఆసీస్ కు రజత పతకం దక్కగా.. ఈ పోటీలలో కివీస్ మూడో స్థానం సాధించింది. భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.