
ఒక పోరాటంలో గెలిచినప్పుడు విజయగర్వంతో పొంగిపోయినవాడికంటే ప్రత్యర్థిని కూడా గౌరవించినవాడే గొప్పవాడవుతాడు. క్రికెట్ లో కూడా ఇదే వర్తిస్తుంది. ఒక్క మ్యాచ్ గెలవగానే ‘మేం తోపులం’ అన్న ఫీలింగ్ తలకెక్కితే మరో మ్యాచ్ లో ఓడితే అదే వారిని నిండా ముంచుతుంది. దీనికి పంజాబ్ కింగ్స్ ట్విటర్ అడ్మినే ప్రత్యక్ష సాక్షి. ఒకప్పుడు తన టీమ్ గెలిచిందని ఎగిరెగిరి పడ్డ అతడికి ఇప్పుడు అసలు కథ అవగతమవుతోంది.
కొద్దిరోజుల క్రితం ముంబై వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో.. రోహిత్ సేన ఆఖరి ఓవర్లో విజయం ముందు బోల్తా కొట్టింది. అప్పుడు పంజాబ్ కింగ్స్ టీమ్ ట్విటర్ నిర్వాహకులు (అడ్మిన్) ముంబైని ట్రోల్ చేస్తూ కాస్త శృతి మించిన పోస్టులే చేశాడు. అర్ష్‌దీప్ సింగ్.. చివరి ఓవర్లో తిలక్ వర్మ, నెహల్ వధేరా వికెట్లను బౌల్డ్ చేసినప్పుడు మిడిల్ స్టంప్స్ రెండు విరిగిపోయాయి.
అప్పుడు పంజాబ్ ట్విటర్ అడ్మిన్.. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ ముంబై పోలీసులకు కంప్లయింట్ తీసుకోవాల్సిందిగా ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కూడా పోస్టులు ముంబై ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. బుధవారం మొహాలీ వేదికగా పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసేప్పుడు, రోహిత్ శర్మ వికెట్ తీసినప్పుడు కూడా చేసిన ట్వీట్స్ వారిలో మరింత ఆగ్రహాన్ని నింపాయి. కానీ మ్యాచ్ తర్వాత అంతా తలకిందులైంది.
పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 18.5 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబై ఫ్యాన్స్.. పంజాబ్ అడ్మిన్ ను ఆటాడుకుంటున్నారు. ముంబై పోలీసులకు అర్ష్‌దీప్ వికెట్ బౌల్డ్ గురించి చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ.. ‘హే పంజాబ్ కింగ్స్.. మేము విజయవంతంగా నేరస్తులను పట్టుకున్నాం..’ అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గత మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి పంజాబ్ ను గెలిపిస్తే నిన్న మాత్రం.. 3.5 ఒవర్లు వేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ లో అర్ష్‌దీప్ కు ఇదే చెత్త స్పెల్.
ముంబై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఏకంగా ముంబై అఫిషియల్ ట్విటర్ ఖాతా ద్వారా పంజాబ్ కింగ్స్ కు కౌంటర్ ఇచ్చారు. పంజాబ్.. ముంబై పోలీసులకు రిపోర్టు చేస్తూ ట్వీట్ చేస్తే దానికి పూర్తి భిన్నంగా.. ‘ఇక్కడి (మొహాలీ) పోలీసు డిపార్ట్‌మెంట్స్ అన్నింటికీ మేం చెప్పేది ఏంటంటే.. మేం రిపోర్టు చేయడానికి ఏం లేదు. మేం కేవలం మా ఆట ఆడాం. ఓ టీమ్ ను చితకబాదాం. వారిని జాగ్రత్తగా చూసుకోండి.. మీ సేవలకు ధన్యవాదాలు..’అని ట్వీట్ చేసింది.