జయవర్దనె, జహీర్ లకు కీలక పదవి.. హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న మహేళ...

Published : Sep 14, 2022, 01:37 PM IST
జయవర్దనె, జహీర్ లకు కీలక పదవి.. హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న మహేళ...

సారాంశం

Mumbai Indians: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా ఉన్న ముంబై ఇండియన్స్  త్వరలోనే ప్రపంచ క్రికెట్  లీగ్ లలో కూడా పాల్గొననున్నది. ఈ మేరకు ఆ  జట్టుకు చెందిన ఇద్దరు కోచింగ్ స్టాఫ్ కు కీలక బాధ్యతలను అప్పజెప్పింది. 

ప్రపంచ క్రికెట్ లీగ్ లలో  అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్  ఆ వ్యవహారాలను చూసుకోవడానికి ఇద్దరు మాజీ ఆటగాళ్లకు కీలక పదవులు అప్పజెప్పింది.  ఐపీఎల్  లో ముంబై ఇండియన్స్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన  ఆ జట్టు హెడ్‌కోచ్ మహేళ జయవర్దనెతో పాటు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఈ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ లో  ప్రస్తుతం ఉన్న పదవుల నుంచి తొలగించి  వారికి  ప్రమోషన్ ఇచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. 

ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ గా ఉన్న మహేళ కు  తాజాగా గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గా ప్రమోట్ చేసిన యాజమాన్యం.. జహీర్ ఖాన్ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్ గా ప్రమోషన్ కొట్టేశాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో  ఈ విషయాన్ని వెల్లడించింది. 

ప్రమోషన్లు రావడంతో ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ లో తమ పదవులు వీడనున్నారు. జయవర్దెనె  2017 నుంచి ముంబై కి హెడ్‌కోచ్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఎవరనేది ముంబై త్వరలోనే ప్రకటించనున్నది. 

 

ఏం చేస్తారు..?

హెడ్‌కోచ్ బాధ్యతలు వదిలి కొత్త పాత్రలోకి వెళ్లనున్న మహేళ..  ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20),  ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) జట్లకు  సంబంధించిన కోచింగ్ స్టాఫ్ కు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. కోచింగ్ స్టాఫ్  తో పాటు మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ వంటి  వ్యవహారాలు చూసుకుంటాడు. ఐపీఎల్ లో రెండు నెలల  పాటు బిజీగా గడిపిన జయవర్దెనేకు ఇక ఏడాదంతా చేతిలో పని  ఉండనుంది. 

జహీర్ విషయానికొస్తే.. ప్లేయర్స్ డెవలప్మెంట్, ఫ్రాంచైజీ ప్రోగ్రామ్ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న కొత్త ఆటగాళ్లను వెతికి  పట్టుకుని వారిని  జట్టులోకి తీసుకురావడం వంటివి చేయనున్నాడు. 

 

ఇదిలాఉండగా  వారి ఎంపికపై జయవర్దెనె, జహీర్ ఖాన్ లు  హర్షం వ్యక్తం చేశారు.  ఈ బాధ్యతలు తమకు అప్పజెప్పినందుకు గాను ముంబై ఇండియన్స్  యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Virat Kohli : మళ్లీ సింహాసనం ఎక్కిన కింగ్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఔట్
Top 5 Cricketers : కోహ్లీ, ధోనిని దాటేసిన హార్దిక్.. అత్యంత ఖరీదైన వాచ్ ఎవరిదో తెలుసా?