ధోనీపై ట్వీట్ సెగ: అదో గుణపాఠమని విరాట్ కోహ్లీ

By telugu teamFirst Published Sep 15, 2019, 10:17 AM IST
Highlights

ధోనీపై చేసిన ట్వీట్ సెగ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాకినట్లే ఉంది. కోహ్లీ ట్వీట్ తో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటారనే పుకార్లు షికారు చేశాయి. దాంతో విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చుకున్నాడు.

ధర్మశాల:  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పై చేసిన ట్వీట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ తో ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడనే పుకార్లు పుట్టాయి. ఆ ట్వీట్ సెగ తనకు కూడా తగలడంతో విరాట్ కోహ్లీ స్పందించాడు.

తనకు అది గుణపాఠం నేర్పిందని విరాట్ కోహ్లీ అన్నాడు. తాను చెప్పిన విషయాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2016 టీ20 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై ఆడిన సమయంలో ధోనీ తనను బాగా పరుగెత్తించాడని, అద్భుతమైన ఆ మ్యాచును మరిచిపోలేనని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. దాన్ని ధోనీకి వీడ్కోలు వాక్యాలుగా భావించారు. 

ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశారని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు కోహ్లీ జవాబు ఇచ్చాడు. నిజానికి తన మనసులో ఏ విధమైన ఉద్దేశం లేదని, తాను ఆ సమయంలో ఇంట్లో కూర్చుని యథాలాపంగా ఆ ఫోటోను పోస్టు చేశానని, కాని అది అందరికీ వార్తగా మారిందని అన్నాడు.

ఓ రకంగా అది తనకు గుణపాఠమని, ఎందుకంటే తాను ఆలోచిస్తున్నట్లు లోకం ఆలోచించడం లేదని, ఈ ట్వీట్ లో చెప్పినట్లు ఆ మ్యాచు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటానని అన్నాడు. అదే విషయాన్ని మొదటిసారి బయటకు చెప్పాలనిపించి చెప్పాని, కానీ ప్రజలు మరో రకంగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నాడు.

పనిలో పనిగా ధోనీపై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ నిరంతరం జట్టు కోసం ఆలోచించే క్రీడాకారుడని అన్నాడు. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలువడమే కాకుండా ధోనీ వారిని ప్రోత్సహిస్తాడని అన్నాడు. కేరీఆర్ కు ఎప్పుడు ముగింపు పలకాలనేది ధోనీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నాడు.

click me!