
‘ప్రాణాలతో ఉంటే వీడు ఎక్కడున్నా రాజేరా...’ అంటాడు బాహుబలిలో నాజర్ (బిజ్జలదేవ). ప్రభాస్ (బాహుబలి) ను రాజ్యం నుంచి తరిమేసినా అతడు సాధారణ జీవితం గడిపినా ప్రజలు మాత్రం అతడిని రాజు గానే చూడటాన్ని జీర్ణించుకోలేక ఈ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ ను కోహ్లి కి ఆపాదిస్తున్నారు అతడి అభిమానులు. ఇటీవలే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లి.. తొలి వన్డేలో కొత్త సారథి రోహిత్ శర్మకు సూచనలు ఇస్తూ కనిపించాడు. కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో రోహిత్-కోహ్లి ల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో..? అని భారత క్రికెట్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. విరాట్ మాత్రం పరిణితిని ప్రదర్శించాడు. తొలి వన్డేలో రోహిత్ కు పలు సూచనలిస్తూ కనిపించాడు కోహ్లి..
ఇప్సుడు ఇదే విషయమై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాయకుడనేవాడు ఎక్కడున్నా నాయకుడే.. కెప్టెన్సీ లేనంత మాత్రానా నాయకత్వ లక్షణాలు ఎక్కడికి పోతాయి..? అని వ్యాఖ్యానించాడు.
తొలి వన్డేలో కీరన్ పొలార్డ్ వికెట్ తో పాటు నాలుగు వికెట్లు తీసుకున్న చాహల్.. ఇన్నింగ్స్ 21 వ ఓవర్లో షామర్ బ్రూక్స్ ను ఔట్ చేసినప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంతి బ్యాట్ కు తాకినట్టు చాహల్ గమనించి ఔట్ గా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో అతడు రోహిత్ శర్మ వైపునకు తిరిగి డీఆర్ఎస్ కు అప్పీల్ చేద్దామని కోరాడు. అప్పుడు రోహిత్.. కీపర్ రిషభ్ పంత్ ను చూస్తూ.. బంతి బ్యాట్ కు తాకిందా..? అని అడగ్గా అతడు కూడా సందేహంతో ఉన్నాడు.
అదే సమయంలో రోహిత్ అక్కడే ఉన్న కోహ్లిని అడిగాడు. కోహ్లి డీఆర్ఎస్ కు వెళ్దామని సూచించాడు. బంతి.. బ్రూక్స్ బ్యాట్ ఎడ్జ్ కు తాకిందని కోహ్లి.. రోహిత్ ను కన్విన్స్ చేశాడు. కోహ్లి చెప్పడంతో రోహిత్ కాదనలేదు. డీఆర్ఎస్ కు వెళ్లాడు. డీఆర్ఎస్ లో బంతి బ్యాట్ కు తాకినట్టు తేలింది.
ఆటగాళ్లు, సెలెక్టర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ..
ఇదే విషయమై అజయ్ జడేజా మాట్లాడుతూ... ‘అతడు చాలా మ్యాచులలో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. విజయాల కోసం వ్యూహాలు, ఎత్తుగడలు వేసిన అపారమైన అనుభవం కూడా ఉంది. అతడు కెప్టెన్ గా మారిన బ్యాక్ బెంచర్ కాదు. సారథ్య బాధ్యతలు లేకున్నా అతడిలో సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయి. 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సచిన్ భుజాలపై ఎత్తుకోవాలని విరాట్ కు ఎవరూ చెప్పలేదు.
అతడు ఎప్పుడూ నాయకుడిగానే ఉంటాడు. కోహ్లి వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ఆ మనస్తత్వమే విరాట్ ను గొప్ప నాయకుడిని చేశాయి. ఇప్పుడు కెప్టెన్సీ లేనంత మాత్రాన అతడిలోని నాయకత్వ లక్షణాలు పోయినట్టు కాదు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆటగాళ్లు, సెలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు కానీ నాయకుడు ఎల్లప్పుడూ నాయకుడిగానే ఉంటాడు..’ అని చెప్పాడు.
చివర్లో జడేజా చెప్పిన మాటలు ఇడియట్ సినిమాలో రవితేజ డైలాగ్ ను గుర్తు చేయడం లేదూ.. ‘సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ చంటిగాడు... లోకల్..’.. ఈ డైలాగ్ ను విరాట్ కు అన్వయించుకోండి ఇక..