అనిల్ కుంబ్లే ఆ రికార్డు ఫీట్‌కి 23 ఏళ్లు... నువ్వు స్వార్థపరుడివి అంటూ భజ్జీ పోస్ట్...

Published : Feb 07, 2022, 01:40 PM IST
అనిల్ కుంబ్లే ఆ రికార్డు ఫీట్‌కి 23 ఏళ్లు... నువ్వు స్వార్థపరుడివి అంటూ భజ్జీ పోస్ట్...

సారాంశం

1999లో పాకిస్తాన్‌తో జరిగిన ఢిల్లీ టెస్టులో 10కి 10 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే... తనకి ఒక్క వికెట్ కూడా వదలలేదంటూ హర్భజన్ సింగ్ ఫన్నీ పోస్ట్...

అనిల్ కుంబ్లే ఆ రికార్డు ఫీట్‌కి 23 ఏళ్లు... నాకు ఒక్క వికెట్ ఇచ్చి ఉండొచ్చుగా అంటూ భజ్జీ...
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసి నేటికి 23 ఏళ్లు పూర్తయ్యాయి.. 1999లో పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు అనిల్ కుంబ్లే...

ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మొట్టమొదటి భారత క్రికెటర్, రెండో క్రికెటర్‌గా నిలిచాడు అనిల్ కుంబ్లే.  1956లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేఖర్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.

పాకిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది టీమిండియా. పాక్ ఓపెనర్లు షాహిద్ ఆఫ్రీదీ, సయ్యద్ అన్వర్ మొదటి వికెట్‌కి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే అసలు సిసలైన మ్యాజిక్ స్పెల్ మొదలైంది.

41 పరుగులు చేసిన ఆఫ్రిదీని అవుట్ చేసిన కుంబ్లే, ఆ తర్వాతి బంతికే ఇయాజ్ అహ్మద్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇంజమామ్ వుల్ హక్, మహ్మద్ యూసఫ్ ఒక్క బాల్ తేడాతో అవుట్ కాగా... ముస్తాక్ అహ్మద్, సక్‌లెన్ ముస్తాక్ వెంటవెంటనే బంతుల్లో అవుట్ అయ్యారు.


మొత్తంగా 26.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అనిల్ కుంబ్లే.. 9 మెయిడిన్లు ఓవర్లు వేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఫలితంగా వికెట్ కోల్పోకుండా 101 పరుగులు చేసిన పాక్, 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 212 పరుగుల భారీ విజయం దక్కింది.

అనిల్ కుంబ్లే రికార్డు ఫీట్‌కి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ‘అదో మరిచిపోలేని రోజు. అనిల్ కుంబ్లే మీరు మరీ స్వార్థపరులు. పదికి 10 వికెట్లు మీరే తీసుకున్నారు. నాకు ఒక్క వికెట్ అయినా వదలొచ్చు కదా... అనిల్ భాయ్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా..’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు హర్భజన్ సింగ్...

ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హర్భజన్ సింగ్‌కి 3 వికెట్లు దక్కాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయాడు హర్భజన్ సింగ్. కుంబ్లే అద్వితీయ స్పెల్ కారణంగా మరో ఎండ్‌లో అతన్ని కొనసాగించాడు అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్...

గత ఏడాది టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా ఈ రికార్డు ఫీట్ సాధించిన విషయం తెలిసిందే. ముంబై టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ అందరి వికెట్లు తీసిన అజాజ్ పటేల్, జిమ్ లాకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?