
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య పూణేలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా క్రికెటర్లు పలు రికార్డులు తిరగరాశారు. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా... తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడాడు.
తద్వారా తొలి ఇన్నింగ్స్‌లోనే అత్యంత వేగంగా అర్థ సెంచరీ (26 బంతుల్లో) చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/54) నమోదు చేసిన టీమిండియా బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డుల్లోకెక్కాడు.
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశంలో 10 వేల పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. ఇక ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ల జాబితాలో శిఖర్ ధావన్ (98) ఐదో స్థానంలో నిలిచాడు.
తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో ఆధిపత్యం వహించి 66 పరుగులతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. అయితే, మొదటి వన్డేలో రికార్డులతో పాటు, కృనాల్ పాండ్యా- టామ్ కరన్ మధ్య జరిగిన వాగ్వాదం వార్తల్లో నిలిచింది.
భారత ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ బౌలింగ్‌లో చేస్తున్నాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా సింగిల్ తీసే క్రమంలో కరన్‌తో వాగ్వాదం చోటు చేసుకుంది. కృనాల్ దూకుడుగా వ్యవహరిస్తూ టామ్‌పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. మధ్యలో అంపైర్ నితిన్ జోక్యం చేసుకున్నా పరిస్ధితి చక్కబడలేదు.
ఇంతలో జోస్ బట్లర్ వచ్చి, టామ్‌తో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరిస్థానాల్లోకి వారు వెళ్లారు. ఈ క్రమంలో కృనాల్‌ను క్రీజులోకి వెళ్లాల్సిందిగా అంపైర్ మరోసారి సూచించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇదంతా చూస్తున్న కోహ్లి కాసేపు కన్ఫ్యూజన్‌కు గురయ్యాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అలా చూస్తుండిపోయాడు. కరన్- కృనాల్ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.