
పూణే: ఇంగ్లండుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండుతో జరిగిన తొలి వన్డేలో అతను అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. తన ఆరంగేట్రంలోనే అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండు పతనాన్ని శాసించాడు. తద్వారా అతను రికార్డు సృష్టించాడు.
పాతికేళ్ల వయస్సు గల కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కీలక సమయంలో జేసన్ రాయ్ (46), బెన్స్ స్టోక్స్ )1) వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీశాడు. తద్వారా ఇంగ్లండు ఓటమిని ఖాయం చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ 54 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. తద్వారా అతను వన్డే ఆరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా అవతరించాడు.
గతంలో వన్డే ఆరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ 21 పరుగులు ఇచ్చిన 3 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ అరోన్ 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. హార్డిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లా 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఈ నలుగురు బౌలర్లను వెనక్కి నెడుతూ నాలుగు వికెట్లతో ప్రసిద్ధ్ కృష్ణ అగ్రస్థానంలో నిలిచాడు.
వారిలో ఇప్పటి వరకు స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్ మీద చేసిన ప్రదర్శన అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. ఇంగ్లండుతో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసి ఆ 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
మూడు వన్డేలో సిరీస్ లో భాగంగా ఇంగ్లండుతో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసిది. ఇంగ్లండు 42.1 ఓవర్లలోనే ఓటమి పాలైంది. 251 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.