కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్.. మరి T20 ఫార్మాట్లో భారత సారథి ఎవరు?

By Galam Venkata Rao  |  First Published Jun 30, 2024, 11:51 AM IST

భారత క్రికెట్ అభిమానులకు ఓ వైపు సంతోషం, మరోవైపు నిరాశ. ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలిచామన్న సంతోషంలో ఉండగానే.. ఈ ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ లు రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఇది కాస్త షాక్ గురిచేసే అంశమే అయినా... T20లో తర్వాత భారత సారథి ఎవరన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. 


టీమిండియా 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టి కరిపించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆనందం అంతా ఇంతా కాదు. దేశమంతా ఆనందంతో సంబరాల్లో మునిగిపోయింది.

Latest Videos

undefined

అయితే, ఈ అద్భుతమైన విజయం తర్వాత ఫ్యాన్స్‌ గుండెలు పగిలే ప్రకటనలు వెలువడ్డాయి. దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన రిటైర్‌మెంట్‌ ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ 2024లో చరిత్రాత్మక విజయం తర్వాత కోహ్లీ చేసిన ఈ ప్రకటనన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఇదే షాక్‌ అనుకుంటే.. దాన్ని మించిన మరో షాకిచ్చాడు మరో క్రికెటర్‌. విరాట్‌ బాటలోనే రోహిత్‌ శర్మ కూడా నడుస్తూ.. తన రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు. ప్రపంచ కప్‌ విజయం తర్వాత... టీ20 క్రికెట్‌ నుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు తెలిపాడు రోహిత్‌ శర్మ. పొట్టి కప్‌కు ఇకపై ఆడబోనని స్పష్టం చేశాడు. 

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్‌ రోహిత్‌.... T20 ఫార్మాట్‌లో ఇదే తన చివరి మ్యాచ్‌ అని ప్రకటించేశాడు.  ‘‘ఇది నా చివరి ఆట. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. నేను ప్రతి క్షణాన్ని ఇష్టపడ్డాను. ఈ ఫార్మాట్‌లోనే నేను భారత కెరీర్‌ని ప్రారంభించా. ఇదే నేను కోరుకున్నది, నేను కప్ గెలవాలనుకున్నాను’’ అని తెలిపారు.

తొలుత విరాట్‌ కోహ్లీ కూడా రిటైర్‌మెంట్‌ ప్రకటన చేశారు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లీ... T20 ఫార్మాట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ రెండు ప్రకటనలతో క్రికెట్‌ అభిమానులు షాక్‌లో ఉన్నారు.

ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్‌ ప్రకటనతో ఇప్పుడు ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. T20లో మరో అధ్యాయం లిఖించేందుకు సిద్ధమవుతున్న భారత జట్టును నడిపించేదెవరన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌, శ్రీలంక వేదికలపై జరగబోయే T20 వరల్డ్‌ కప్‌-2026కు భారత జట్టుకు సారథ్యం వహించిగల నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. హార్దిక్‌ పాండ్యా, జస్ప్రిత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లలో ఒకరు కాబోయే కెప్టెన్‌ అని తెలుస్తోంది. 

పాండ్యాకే పగ్గాలు...
టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా తదుపరి భారత కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. భారత ఆల్ రౌండర్ ఆటగాడైన హార్దిక్‌... గతంలో కొన్ని సిరీస్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. తర్వాత జరగబోయే T20లకు హార్దిక్‌యే కెప్టెన్‌ అవుతాడని విస్తృతంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. 2024 T20 ప్రపంచ కప్‌లోనూ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

 

బుమ్రాకూ ఛాన్స్‌...
భారత క్రికెట్ కిరీటం జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. బుమ్రా తక్కువ మాట్లాడే వ్యక్తే కానీ, బౌలింగ్‌లో అతని సహజసిద్ధమైన సామర్థ్యం బుమ్రా కెప్టెన్సీకి చోదక అంశం. పేసర్‌గా బుమ్రా దూకుడు స్వభావం కలవాడు. టీమిండియా విన్నర్‌ కూడా. కాబట్టి, బుమ్రా కచ్చితంగా లెక్కలో ఉంటాడు.

సూర్యకుమార్ యాదవ్..
భారత క్రికెట్‌ భావి సారథుల్లో మరో పేరు సూర్యకుమార్ యాదవ్. కామ్‌ అండ్‌ కంపోజ్డ్ నేచర్‌తో ఉండే సూర్య పేరు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. సెలెక్టర్లు ఎవరైనా సమిష్టిగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే.. సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్‌ కావొచ్చు. రెండు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు సూర్య.

పంత్‌కు పగ్గాలు దక్కేనా...?
ఇకపోతే, రిషబ్‌ పంత్ పేరుకూ కెప్టెన్సీ పోటీలో ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌కి సౌత్‌పావ్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ భావిస్తే... పంత్ బ్యాట్‌తో, ఇంకా స్టంప్‌ల వెనుక తన అధికారాన్ని చూపించాల్సి ఉంటుంది. ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవంతో పంత్ రేసులో ఉండే అవకాశం లేకపోలేదు..

click me!