Shikhar Dhawan: ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాలేదని గబ్బర్ ను చితకబాదిన వైనం.. కిందపడేసి కాళ్లతో తొక్కుతూ దాడి

Published : May 25, 2022, 06:41 PM IST
Shikhar Dhawan: ప్లేఆఫ్స్ కు క్వాలిఫై  కాలేదని గబ్బర్ ను చితకబాదిన వైనం..  కిందపడేసి కాళ్లతో తొక్కుతూ దాడి

సారాంశం

IPL 2022: ఐపీఎల్- 15 సీజన్ లో ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది పంజాబ్ కింగ్స్. దీంతో ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్  దాడికి గురయ్యాడు. దాడి చేసింది ఎవరో కాదు...!

ఐపీఎల్ లో పంజాబ్ చరిత్ర పెద్దగా మారదని మరోసారి ప్రూవ్ చేస్తూ మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని  పీబీకేఎస్.. ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిచింది. కెప్టెన్లు మారినా ఆటగాళ్లు మారినా  ఆ జట్టు రాత మారకపోవడంతో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జట్టులో ఓపెనర్ గా ఉన్న  గబ్బర్ అలియాస్ శిఖర్ ధావన్ పై  పంజాబ్ కు చెందిన ఓ అభిమాని  ఫ్రస్టేషన్ భరించలేక తుక్కుతుక్కుగా కొట్టాడు.  ధావన్ ను కిందపడేసి కాళ్లతో తంతూ కసితీరా కొట్టాడు. 

అదేంటి..? హీరో విలన్ కొట్టుకుని మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను బలి చేసినట్టు,  పంజాబ్ ఓటమికి ఒక్క ధావన్ పై దాడి చేయడమేంటి..? అనుకుంటున్నారా..? గబ్బర్ పై దాడి చేసిందెవరో కాదు.  అతడి తండ్రే. ఇందుకు సంబంధించిన వీడియోను  ధావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. 

ఈ వీడియోలో ధావన్ తండ్రి మహేంద్ర పాల్ ధావన్ తో ఓ ఫన్నీ రీల్ చేశాడు. అందులో  మహేంద్ర పాల్.. ధావన్ ను చేతులతో కొడుతూ కింద పడేసి కాళ్లతో తొక్కుతూ   తన్నుతున్నట్టు  నటించాడు. ఓ పాత బాలీవుడ్  సినిమా క్లిప్ ను స్ఫూర్తిగా తీసుకుని  ఈ రీల్ చేశాడు ధావన్.  ఈ వీడియోకు క్యాప్షన్ గా ‘ఐపీఎల్ నాకౌట్  దశకు వెళ్లకపోయినందుకు మా డాడీ నన్ను చితకబాదుతున్నాడు..’ అని రాసుకొచ్చాడు.  ఈ రీల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాతో పాటు మరికొందరు పంజాబ్ ఆటగాళ్లు లైక్ చేయడం గమనార్హం. ఈ వీడియోలో ధావన్ సోదరి (శ్రేష్ట ధావన్) ని కూడా చూడొచ్చు.  

 

ఈ సీజన్ లో పంజాబ్.. 14  మ్యాచులాడి ఏడు విజయాలు, 7 ఓటములతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక బ్యాటర్ గా శిఖర్ ధావన్ మరోసారి ఆకట్టుకున్నాడు. అతడు 14 మ్యాచులలో 460 పరుగులు  చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలుండగా అత్యధిక స్కోరు 88 నాటౌట్ గా  ఉంది. కాగా ఒక సీజన్ లో 400 ప్లస్ స్కోర్లు చేయడం ధావన్ కు ఇది ఏడోసారి.  ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నా ధావన్ ను మాత్రం టీ20 జట్టులోకి ఎంపికచేయడం లేదు సెలెక్టర్లు. తాజాగా దక్షిణాఫ్రికా  తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో కూడా ధావన్ కు మొండిచేయి చూపారు సెలెక్టర్లు.  

 

ఈ వ్యవహారం వెనుక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.  అక్టోబర్ లో ఆసీస్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో  జట్టును ఇప్పట్నుంచే సిద్ధం చేసేందుకు  యువకులకు అవకాశమిస్తున్నామని ధావన్ కు ద్రావిడ్ చెప్పినట్టు  తెలుస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?