శిఖర్ ధావన్‌ని పిచ్చికొట్టుడు కొట్టిన తండ్రి... ప్లేఆఫ్స్‌ ఆడకుండా వస్తావా అంటూ...

By Chinthakindhi RamuFirst Published May 25, 2022, 6:38 PM IST
Highlights

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఇంటికి వెళ్లి, తండ్రితో కలిసి ఫన్నీ వీడియో షేర్ చేసిన శిఖర్ ధావన్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు శిఖర్ ధావన్. గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆడిన శిఖర్ ధావన్, ప్లేఆఫ్స్‌ ఆడాడు. 2020 సీజన్‌లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్, మొట్టమొదటిసారి ఫైనల్ చేరింది...

అయితే పంజాబ్ కింగ్స్, ఎప్పటిలాగే గత మూడు సీజన్ల ఆనవాయితీని కొనసాగిస్తూ ఏడు విజయాలతో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. శిఖర్ ధావన్ 14 మ్యాచుల్లో 38.33  సగటుతో 460 పరుగులు చేసినా తన జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు...

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడంతో స్వగ్రామానికి చేరుకున్నాడు శిఖర్ ధావన్. ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా అభిమానులను అలరించే గబ్బర్, దీన్ని కూడా ఫన్నీగా మలిచాడు... ‘ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాకుండా ఇంటికి తిరిగి వచ్చినందుకు మా నాన్న ఇలా కొడుతున్నాడంటూ...’ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు శిఖర్ ధావన్...

 

ఇందులో శిఖర్ ధావన్ తండ్రి మోహిందర్ పాల్ ధావన్, శిఖర్ ధావన్‌పై చేయి చేసుకున్నట్టుగా, కాలితో తన్నుతున్నట్టుగా నటిస్తూ జీవించేశారు... శిఖర్ ధావన్ కింద పడిపోయినా కొట్టుకుంటూ కుమ్మేయడం చూసి ఫ్యాన్స్ నవ్వుకున్నారు... 

ఐపీఎల్‌లో 400+ పైగా పరుగులు చేయడం శిఖర్ ధావన్‌కి ఇది 8వ సారి. గత 12 సీజన్లుగా  ప్రతీ సీజన్‌లోనూ 300+ పరుగులు చేస్తూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు శిఖర్ ధావన్. అయితే ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన భారత జట్టులో శిఖర్ ధావన్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లకు సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు దక్కలేదు. దీంతో శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ దక్కవచ్చని భావించారంతా. అయితే శిఖర్ ధావన్‌కి కాకుండా సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా టీమిండియాని వన్డే సిరీస్‌లో వైట్ వాష్ చేసిన కెఎల్ రాహుల్‌కి మరోసారి అవకాశం ఇచ్చింది బీసీసీఐ...

‘గత దశాబ్దకాలంలో శిఖర్ ధావన్, భారత జట్టుకి ఎంతో చేశాడు. టీ20ల్లో కూడా అతని సేవలు మరువలేనివి. అయితే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది... రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్‌ వంటి యంగ్ ప్లేయర్ల మధ్యలో 36 ఏళ్ల సీనియర్‌ని ఇరికించడం కష్టమని ద్రావిడ్ భావించారు. సంజూ శాంసన్‌ని కూడా అందుకు ఎంపిక చేయలేదు... రాహుల్ ద్రావిడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మేమంతా ఆయన చెప్పిన దాన్ని అంగీకరించాల్సి వచ్చింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో తనకి చోటు ఉండదని రాహుల్ ద్రావిడ్ స్వయంగా శిఖర్ ధావన్‌కి చెప్పారు... రాహుల్‌కి ఏం కావాలో స్పష్టమైన అవగాహన ఉంది. శిఖర్ ధావన్‌కి వన్డేల్లో తప్పకుండా చోటు ఉంటుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ శిఖర్ ధావన్‌ చోటుకి వచ్చిన ప్రమాదమేమీ లేదు. టీ20ల్లో మాత్రం కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ద్రావిడ్ చెప్పారు... మేం అదే పాటించాం...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేశాడు...

click me!