
IND vs WI Ahmedabad Test : ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో ఫామ్ లోకి వచ్చిన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం వెస్టిండిస్ తో జరుగుతున్న సీరీస్ లోనూ కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో తనదైన క్లాస్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు రాహుల్. ఇలా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
ఈ టెస్ట్ సెంచరీ రాహుల్ కు చాలా ప్రత్యేకమైనది… సరిగ్గా 8 ఏళ్ల తర్వాత స్వదేశంలో అతడు టెస్ట్ సెంచరీ సాధించాడు. అందుకే ఈ స్పెషల్ సెంచరీని అతడు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. రాహుల్ సెంచరీ సహాయంతో టీమిండియా రెండో రోజు ఆట మొదటి సెషన్‌లో 3 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. మొత్తం 51 పరుగుల ఆధిక్యం సాధించింది.
కేఎల్ రాహుల్ 8 ఏళ్ల క్రితం అంటే 2016లో చివరిసారిగా టెస్ట్ సెంచరీ సాధించాడు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో చివరిసారిగా స్వదేశంలో సెంచరీ చేశాడు. అదే టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత రాహుల్ స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో మూడంకెల స్కోరు నమోదు చేయడంలో పదేపదే విఫలమవుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు విండీస్‌పై సెంచరీ చేయడం ద్వారా స్వదేశంలో టెస్ట్ సెంచరీల కరువును తీర్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
అహ్మదాబాద్ టెస్ట్ లో మొదటి నుంచి చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ 190 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలతో మూడంకెల స్కోరు నమోదు చేశాడు.
అంతకుముందు 122 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరోసారి జాగ్రత్తగా ఆడింది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ జోడీ మూడో వికెట్‌కు 98 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకుంది. శుభ్‌మన్ గిల్ 100 బంతులు ఎదుర్కొని 5 బౌండరీలతో 50 పరుగులు చేసి కెప్టెన్ రోస్టన్ చేజ్‌కు వికెట్ ఇచ్చాడు.