తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... కెఎల్ రాహుల్ అవుట్, ఇంకా ఆధిక్యంలోనే ఇంగ్లాండ్...

By Chinthakindhi RamuFirst Published Sep 4, 2021, 5:09 PM IST
Highlights

46 పరుగులు చేసి పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్...  తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం... ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఖాతాలో రేర్ రికార్డు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టుకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 83 పరుగులు జోడించిన తర్వాత కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది టీమిండియా...

101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది...

అంతకుముందు క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూకి వెళ్లి, బతికిపోయిన కెఎల్ రాహుల్... ఆ సంఘటన తర్వాత కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు...

కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 16 పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను రోరీ బర్న్స్ మరోసారి జారవిడిచాడు. రెండో రోజు ఆట ప్రారంభంలోనూ రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను రోరీ బర్న్స్ నేలవిడిచాడు...

రోహిత్ శర్మ ఓపెనర్‌గా 11 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 11 వేల మైలురాయిని అందుకుంటే, రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు...  251 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన మాథ్యూ హెడెన్, 258 ఇన్నింగ్స్‌ల్లో సునీల్ గవాస్కర్ ఈ మైలురాయిని అందుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

click me!