Ind Vs SA: పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. ప్చ్! మళ్లీ నిరాశపరిచిన నయావాల్.. టీమిండియాకు ఆదిలోనే తొలిదెబ్బ

By Srinivas MFirst Published Jan 13, 2022, 3:33 PM IST
Highlights

Keegan Petersen Stunning Catch: మూడో రోజు ఆట ఆరంభం కాగానే భారత్ కు తొలి దెబ్బ తగిలింది. ఈ మ్యాచులో తప్పకుండా రాణిస్తాడని భారత అభిమానులు ఆశలు పెట్టుకున్న నయావాల్.. రెండో బంతికే వెనుదిరిగాడు. 
 

దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో టెస్టులో భారత జట్టుకు మూడో రోజు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ స్కోరు మీద కన్నేసిన టీమిండియాకు మార్కొ జాన్సేన్ తొలి ఓవర్ లోనే షాకిచ్చాడు. తప్పక ఆదుకుంటాడని భారత అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న నయా వాల్ ఛతేశ్వర్ పుజారా  మళ్లీ దారుణంగా నిరాశపరిచాడు.  పీటర్సన్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ తో భారత అభిమానుల ఆశలపై దక్షిణాఫ్రికా నీళ్లు చల్లింది. పక్షిలా ముందుకు దూకుతూ  పీటర్సన్ క్యాచ్ అందుకున్న తీరును చూస్తే మైమరిచిపోవాల్సిందే. 

57 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు.  ఈ సెషన్ లో నిలదొక్కుకుంటాడని భావించిన పుజారా.. జాన్సేన్ వేసిన రెండో బంతికే పెవిలియన్ కు చేరాడు.  షాట్ డెలివరీలు ఆడటంలో పుజారా బలహీనతను గమనించిన దక్షిణాఫ్రికా పక్కా స్కెచ్ తో అతడిని దెబ్బ కొట్టింది. 

షాట్ బంతులు ఆడటంలో విఫలమవుతున్న  పుజారాను అదే ఉచ్చులో  దింపాడు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. జాన్సేన్ తో  షాట్ డెలివరిని వేయించిన అతడు.. లెగ్ స్లిప్ వద్ద కీగన్ పీటర్సన్ ను ఫీల్డింగ్ కు పెట్టాడు.  జాన్సేన్ వేసిన ఇన్నింగ్స్ 17.2 ఓవర్ బంతిని పుజారా  లెగ్ సైడ్ దిశగా ఆడాడు.  దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న  పీటర్సన్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా  క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

 

Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 | pic.twitter.com/zqcAtMahSi

— Cricket South Africa (@OfficialCSA)

పుజారా నిష్క్రమించగానే వచ్చిన మరో వెటరన్ రహానే కూడా అదే బాటలో పయనించాడు. 9 బంతులాడి.. ఒక  పరుగే  చేసి రబాడా బౌలింగ్ లో ఔటయ్యాడు.  రబాడా వేసిన బంతి.. రహానే గ్లవ్స్ కు తాకి కీపర్ వైపునకు వెళ్లగా అది కాస్తా అతడి చేతుల్లోంచి మిస్ అవడంతో ఫస్ట్ స్లిప్ప్ లో ఫీల్డింగ్ చేస్తున్న డీన్ ఎల్గర్ దానిని అందుకున్నాడు. దీంతో రహానే ఇన్నింగ్స్ ముగిసింది.  భారత జట్టు ఈ ఇద్దరిపై భారీ ఆశలు పెట్టుకున్నా వీళ్లు మాత్రం వాళ్ల ఆటతీరును మార్చుకోలేదు. 

రహానే నిష్క్రమణతో బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్.. కోహ్లి కి జతకలిశాడు.  ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా ఆడుతున్నారు. తన సహజ శైలికి తగ్గట్టుగా పంత్.. (36 బంతుల్లో 31 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. మరోవైపు కోహ్ల (97 బంతుల్లో 18 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐదో వికెట్ కు ఈ ఇద్దరూ ఇప్పటికే 40 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 34 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత ఆధిక్యం 111 పరుగులుగా ఉంది. 
 

click me!