
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభమై 3 రోజులు అయ్యిందో లేదో ఇప్పటికే ఇద్దరు స్టార్ ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన కేన్ విలియంసన్, మోకాళ్ల మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు..
గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన కేన్ విలియంసన్, స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. స్వదేశానికి తిరిగి వెళ్తున్న సమయంలో కేన్ విలియంసన్ షేర్ చేసిన ఫోటో చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిలబడేందుకు కూడా కష్టపడుతున్న కేన్ విలియంసన్, మోకాళ్లకి కట్టుతో క్రట్చెస్ (ఊత కర్రలు) సాయంతో నిలబడి థమ్సప్ చూపిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...
‘థ్యాంక్యూ గుజరాత్ టైటాన్స్, ఎందరో అద్భుతమైన ప్లేయర్లను కలిశారు. కొన్నిరోజులుగా నాకు అండగా నిలిచిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంటికి వెళ్తున్నా, త్వరలో రికవరీ అవుతాను.. మీ అందరి మెసేజ్‌లకు థ్యాంక్యూ...’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు కేన్ విలియంసన్...
కేన్ విలియంసన్ పోస్టుపైన సురేష్ రైనా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రుతురాజ్ గైక్వాడ్, శ్రీవాత్సవ గోస్వామి తదితర క్రికెటర్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేశారు... ఐపీఎల్ 2022 సీజన్‌లో కేన్ విలియంసన్‌ని రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
అయితే 2022 సీజన్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన కేన్ విలియంసన్‌ని, 2023 మినీ వేలానికి వదిలేసింది. 2023 మినీ వేలంలో రూ.2 కోట్లకు కేన్ విలియంసన్‌ని కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. రూ.2 కోట్లలో ట్యాక్సులు పోగా కేన్ మామకి వచ్చేది రూ.1.6 కోట్లు మాత్రమే.. ఈ మొత్తానికి ఇండియా దాకా వచ్చి ఆడడమే గొప్ప అనుకుంటే బోనస్‌గా పెద్ద గాయమైంది..
న్యూజిలాండ్ కెప్టెన్‌కి ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన కేన్ విలియంసన్‌ని, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ముద్దుగా ‘కేన్ మామ’ అని పిలుస్తారు. అలాంటి కేన్ విలియంసన్‌ని ఇలాంటి పొజిషన్‌లో చూడలేకపోతున్నారు అభిమానులు. ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన కేన్ విలియంసన్, ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడో తెలియడం లేదు. ఒకవేళ వచ్చే వన్డే వరల్డ్ కప్ సమయానికి కేన్ విలియంసన్ పూర్తిగా కోలుకోకపోతే, న్యూజిలాండ్‌కి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది..
అలాగే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రీస్ తోప్లే ఎముక పక్కకు జరిగినట్టు తెలిపాడు దినేశ్ కార్తీక్. అతని గాయం కూడా తీవ్రమైనదే కావడంతో రీస్ తోప్లే, ఇప్పట్లో ఐపీఎల్ ఆడే అవకాశం లేదు...