గెలిచింది ఒక్క మ్యాచ్‌యే రా బాబూ... ఏదో టైటిల్ గెలిచేసినట్టు ఇంత గోల చేస్తారేంటి! ఆర్‌సీబీ సెలబ్రేషన్స్‌పై...

Published : Apr 03, 2023, 04:38 PM IST
గెలిచింది ఒక్క మ్యాచ్‌యే రా బాబూ... ఏదో టైటిల్ గెలిచేసినట్టు ఇంత గోల చేస్తారేంటి! ఆర్‌సీబీ సెలబ్రేషన్స్‌పై...

సారాంశం

ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మొదటి మ్యాచ్ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ సెలబ్రేషన్స్.. 

వాడికి ఆనందం వచ్చినా, దు:ఖం వచ్చినా ఓ పట్టాన ఆగదంటారు. ఆర్‌సీబీకి ఈ సామెత సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ టీమ్‌లో ప్రధాన ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నైజం ఇదే. విరాట్‌కి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అస్సలు ఆపుకోడు. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...


తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కి శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ 1, ఇషాన్ కిషన్ 10, కామెరూన్ గ్రీన్ 5, సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్, మొదటి 10 ఓవర్లలో 55 పరుగులే చేసింది...

ఒకానొక దశలో ముంబై 100 పరుగులైనా దాటుతుందా? అనే అనుమానాలు రేగాయి. అయితే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తిలక్ వర్మ కారణంగా ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు రాబట్టింది ముంబై ఇండియన్స్...

ఈ లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లిసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. అయితే 3 బంతుల్లో 2 సిక్సర్లు బాదిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి విరాట్ కోహ్లీ మ్యాచ్‌ని ముగించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

సీజన్‌లో శుభారంభం దొరికినప్పుడు ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకోవడంలో తప్పేం లేదు. అయితే సీజన్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినంతనే, ఐపీఎల్ టైటిల్ గెలిచేసినట్టుగా రచ్చరచ్చగా సాగాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెలబ్రేషన్స్..

15 సీజన్లుగా అభిమానులను నిరాశపరుస్తూనే వస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారనే కారణంగానే ఆర్‌సీబీకి మళ్లీ మళ్లీ సపోర్ట్ చేస్తున్నారు అభిమానులు. అయితే సీజన్లు మారుతున్నా టీమ్ రిజల్ట్ మాత్రం మారడం లేదు..

తొలి మ్యాచ్ విజయానికే ఇలా ఉప్పొంగిపోయే సెలబ్రేట్ చేసుకుంటే, మున్ముందు వరుసగా మూడు, నాలుగు గెలిస్తే ఆర్‌సీబీ అరాచకాలను తట్టుకోలేం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఓ వైపు ఐదో సారి టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకుని ఉండరని, టైటిల్ గెలిచేదాకా కాస్త ఇలా అతి చేష్టలు మానుకుంటే మంచిదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?