నిన్న లంక.. నేడు విండీస్.. మాజీ ఛాంపియన్లకు తప్పని షాకులు.. వరల్డ్ కప్ రేస్ నుంచి ఔట్..!

Published : Apr 03, 2023, 03:45 PM IST
నిన్న లంక.. నేడు విండీస్..  మాజీ ఛాంపియన్లకు తప్పని షాకులు.. వరల్డ్ కప్ రేస్ నుంచి ఔట్..!

సారాంశం

ICC WC 2023:  ఈ ఏడాది  భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్  లో పాల్గొనేందుకు గాను నేరుగా  అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన శ్రీలంక  బాటలోనే తాజాగా  వెస్టిండీస్ కూడా నడిచింది. 

గతంలో రెండు సార్లు  వన్డే వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్ టీమ్ కు భారీ షాక్ తగిలింది.  ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో   నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కరేబియన్ జట్టు కోల్పోయింది.  దక్షిణాఫ్రికా - నెదర్లాండ్స్ మధ్య  ఆదివారం ముగిసిన  రెండు వన్డేల సిరీస్ ను  సఫారీలు 2-0తో  గెలుచుకున్న తర్వాత  విండీస్..   వన్డే వరల్డ్ కప్  లో డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఛాన్స్ ను కోల్పోయింది. 

కొద్దిరోజుల క్రితమే.. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న  శ్రీలంక జట్టు  కూడా వరల్డ్ కప్ లో  డైరెక్ట్ క్వాలిఫై ఛాన్స్ ను కోల్పోయిన విషయం తెలిసిందే.   కివీస్  పై వన్డే సిరీస్ కోల్పోవడంతో శ్రీలంకకు ఈ షాక్ తాకింది.  

ఇక తాజాగా  విండీస్ కూడా ఇదే బాటలో నడిచింది. నెదర్లాండ్స్ పై ఆదివారం జోహన్నస్‌బర్గ్ వేదికగా  ముగిసిన  రెండో వన్డేలో   సౌతాఫ్రికా  ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  ఈ  మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  సఫారీలు.. నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి  370 పరుగులు చేశారు.  ఎయిడెన్ మార్క్‌రమ్.. (175) వీరవిహారానికి తోడు  కిల్లర్ మిల్లర్  (91) విధ్వంసం తోడుకావడంతో  ఆ జట్టు  భారీ స్కోరు చేసింది. అనంతరం  నెదర్లాండ్స్.. 39.1 ఓవర్లలో  224 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్ సిసంద మగల ఐదు వికెట్లతో చెలరేగాడు. 

డైరెక్ట్ క్వాలిఫికేషన్ సినారియో.. 

ప్రస్తుత ఐసీసీ  మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్  సూపర్ లీగ్ స్టాండింగ్స్ ప్రకారం.. ఈ  సైకిల్  ముగిసేసరికి టాప్ - 8 టీమ్ లు అక్టోబర్ లో జరిగే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధిస్తాయి.    అయితే  ఈ జాబితాలో  ఇదివరకే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా,  అఫ్గానిస్తాన్ లు  నేరుగా క్వాలిఫై అయ్యాయి.    ఎనిమిదో స్థానం  కోసం  కొద్దిరోజుల క్రితం వరకూ  సౌతాఫ్రికా,  వెస్టిండీస్, శ్రీలంక మధ్య  పోటీ ఉండేది.  కానీ లంకను కివీస్ ఓడించడంతో  ఆ జట్టుకు ఆస్కారం లేకుండా పోయింది. 9వ స్థానంలో విండీస్ కు  ప్రస్తుతం  88 పాయింట్లు ఉన్నాయి.   కానీ సౌతాఫ్రికా..   98 పాయింట్లతో  8వ స్థానంలో ఉంది.   

 

నెదర్లాండ్స్ తో  సిరీస్ విజయంతో  ఆ జట్టుకు కలిసొచ్చింది.  ఐతే సిరీస్ గెలిచినా  సఫారీలు ఇంకా అధికారికంగా క్వాలిఫై స్థితికి రాలేదు.  వచ్చే నెలలో బంగ్లాదేశ్.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. వన్డే సిరీస్ లో భాగంగా ఐర్లాండ్.. బంగ్లాతో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లలో గనక ఐర్లాండ్ గెలిస్తే అప్పుడు  సౌతాఫ్రికాకు  కష్టమే.  

వన్డే  ప్రపంచకప్ లో ఆడాలంటే ఇప్పుడు లంక, విండీస్ లు.. జూన్ నుంచి జింబాబ్వే వేదికగా జరిగే  క్వాలిఫయర్స్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.  శ్రీలంకతో పాటు  జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్, వెస్టిండీస్,  ఐసీసీ అసోసియేట్ దేశాలు   క్వాలిఫై రౌండ్ ఆడతాయి. ఇక క్వాలిఫై రౌండ్ లో అర్హత (టాప్-3 జట్లు)  సాధించిన జట్లే   మిగిలిన 8 జట్లతో కలుస్తాయి.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే