
ముంబై ఇండియన్స్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఫైవ్ టైం ఐపీఎల్ విన్నింగ్ టీమ్, ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా రూపంలో ఓ స్టార్ బౌలర్‌ని దూరం చేసుకుంది. తాజాగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడడం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జే రిచర్డ్‌సన్, కొన్ని రోజులుగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. జనవరి 2022 ప్రారంభం నుంచి జే రిచర్డ్‌సన్, క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్‌లో జే రిచర్డ్‌సన్ ఆడతాడని భావించినా అలా జరగలేదు. రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జే రిచర్డ్‌సన్, రెండు రోజుల క్రితం క్లబ్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఫ్రీమంట్లే, వారెన్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జే రిచర్డ్‌సన్, గాయం తిరగబెట్టడంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు...
వేసిన నాలుగు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి ఇంప్రెస్ చేసిన జే రిచర్డ్‌సన్, టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కి ఎంపికయ్యాడు. మార్షల్ కప్ ఫైనల్ ఆడిన తర్వాత అతను ఇండియా ఫ్లైట్ ఎక్కాల్సింది. అయితే అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
జే రిచర్డ్‌సన్ స్థానంలో నాథన్ ఎల్లీస్‌కి అవకాశం కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. నాథన్ ఎల్లీస్‌కి ఇప్పటిదాకా 3 అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు జే రిచర్డ్‌సన్ లేకపోతే ఆస్ట్రేలియాకి వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు...
అయితే ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా రూపంలో స్టార్ బౌలర్‌ని దూరం చేసుకున్న ముంబై ఇండియన్స్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుమతులు ఇవ్వడంతో జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్ ఆడబోతున్నాడు...
జోఫ్రా ఆర్చర్‌తో కలిసి జే రిచర్డ్‌సన్ బౌలింగ్ చేస్తాడని అనుకున్నారంతా. అయితే రిచర్డ్‌సన్ కూడా తప్పుకోవడంతో ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ మరింత బలహీనంగా మారింది. జోఫ్రా ఆర్చర్ ఒక్కడిపైనే ఆధారపడి మ్యాచులు గెలవడం అయ్యే పని కాదు. అతను ఎంత బాగా బౌలింగ్ వేసినా, ఆర్చర్ కోటా 4 ఓవర్లు మాత్రమే...
రెండున్నరేళ్లుగా గాయాలతో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గాయంతో 2022 సీజన్ ఆడని జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడినా పూర్తి మ్యాచులకు అందుబాటులో ఉండడం అనుమానమే..
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో జే రిచర్డ్‌సన్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అయితే కరోనా సెకండ్ వేవ్ భయంతో చెప్పా పెట్టకుండా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లిపోయాడు జే రిచర్డ్‌సన్. ఈ కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ఐపీఎల్ 2023 వేలంలో బేస్ ప్రైజ్ రూ.1 కోటి 50 లక్షలకు జే రిచర్డ్‌సన్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...