హ్యాట్రిక్‌తో చరిత్ర క్రియేట్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్... రంజీ ట్రోఫీలో రికార్డు స్పెల్...

By Chinthakindhi RamuFirst Published Jan 3, 2023, 1:37 PM IST
Highlights

ఢిల్లీతో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ తీసిన జయ్‌దేవ్ ఉనద్కట్... తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన సౌరాష్ట్ర కెప్టెన్... 133 పరుగులకి ఢిల్లీ ఆలౌట్..

12 ఏళ్ల తర్వాత టీమిండియా తరుపున టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్, అదే జోష్‌తో రంజీ ట్రోఫీలోనూ చరిత్ర క్రియేట్ చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మొట్టమొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్...

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు సౌరాష్ట్ర కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కట్. మూడో బంతికి ధృవ్ షోరేని అవుట్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఆ తర్వాత వెంటవెంటనే వైభవ్ రావల్, యశ్ ధుల్‌లను పెవిలియన్ చేర్చాడు. జయ్‌దేవ్ బౌలింగ్ ధాటికి ఈ ముగ్గరూ డకౌట్ అయ్యారు...

జయ్‌దేవ్ ఉనద్కట్ ప్రతాపం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాతి ఓవర్‌లో జాంటీ సింధు, లలిత్ యాదవ్ కూడా పెవిలియన్ చేరారు. తొలి రెండు ఓవర్లలో 5 పరుగులిచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఐదు వికెట్లు తీశాడు. ఆ లంచ్ తర్వాత లక్ష్యయ్ తరేజా కూడా జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

తొలి సెషన్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. రెండో సెషన్‌లో మరో 2 వికెట్లు తీశాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసిన జయ్‌దేవ్ ఉనద్కట్ 39 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్ కారణంగా ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 133 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. ధ్రువ్ షోరే, ఆయుష్ బదోనీ, వైభవ్ రావల్, యష్ ధుల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ డకౌట్ కాగా జాంటీ సింధు 4, లక్ష్యయ్ తరేజా 1 పరుగు చేసి అవుట్ అయ్యారు...

ప్రాంశు విజయ్‌రాన్ 15 పరుగులు చేయగా శివాంక్ వశిస్ట్ 38 పరుగులు చేశాడు. హృతీక్ షోకీన్ 90 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

53 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని శివాంక్ వశిష్ట్, హృతిక్ షోకీన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 80 పరుగులు జోడించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది ఢిల్లీ... టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్, పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ తీయగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు.. 

click me!