
Jasprit Bumrah : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ దక్కుతుందని చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో ఇదివరకు వైస్ కెప్టెన్ గా చేసిన బుమ్రాకు కెప్టెన్సీ దక్కడం ఖాయమనే వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా శుభ్ మన్ గిల్ భారత టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. బీసీసీఐ దీనిపై వివరణ కూడా ఇచ్చింది.
తాజాగా భారత జట్టు కెప్టెన్సీపై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా స్పందించాడు. భారత్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు తాను ఎందుకు తీసుకోకూడదనే విషయాలు ప్రస్తావించారు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌ను ప్రధాన కారణంగా చూపుతూ, ఐదు టెస్టుల సిరీస్ సమయంలో అన్ని మ్యాచ్‌లు ఆడలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో అతను కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వచ్చాడు.
ఇంగ్లాండ్ టూర్ సందర్భంగా SKY Sportsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ.. ఐపీఎల్ సమయంలోనే బీసీసీఐ తో తాను కెప్టెన్సీ విషయంపై చర్చించానని తెలిపాడు. "రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యేలోపు ఐపీఎల్ సమయంలోనే బీసీసీఐకి వర్క్ లోడ్ గురించి ముందుగా చెప్పాను. నా వెన్నును పర్యవేక్షించే మెడికల్ టీం, ట్రైనింగ్ టీం సభ్యులతో మాట్లాడాక, తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం" అని బుమ్రా వివరించాడు.
బీసీసీఐ తనను టెస్ట్ కెప్టెన్సీ కోసం పరిగణించిందని చెప్పిన బుమ్రా.. తానే స్వయంగా దానిని తిరస్కరించానని తెలిపాడు. "నాయకత్వ బాధ్యతలు వద్దని నేనే బీసీసీఐకి ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే నేను ఐదు టెస్టులు ఆడలేను. మూడు టెస్టులకు ఒకరు కెప్టెన్, మిగతా మ్యాచ్‌లకు ఇంకొకరు నాయకత్వం వహించాల్సి వస్తే అది టీమ్‌కు అన్యాయమే అవుతుంది. నేను ఎప్పుడూ టీమ్ ను ముందే ఉంచుతాను" అని బుమ్రా వ్యాఖ్యానించాడు.
ఇదివరకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కూడా ఇదే విషయాన్ని కొంతమేర సమర్థిస్తూ మాట్లాడారు. "ఆస్ట్రేలియా టూర్‌లో బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఐదు టెస్టులన్నింటికీ అందుబాటులో లేనప్పుడు, అతను ఆటగాడిగా ఎంతో ముఖ్యం. కెప్టెన్ గా ఉన్నపుడు అదనపు ఒత్తిడి ఉంటుంది. అతని ఫిట్‌నెస్‌కు మేము ప్రాధాన్యం ఇచ్చాం. కీలక నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పారు.
జూన్ 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే బుమ్రా మొదటి టెస్టు ఆడతాడని ధృవీకరించినా, మొత్తం ఐదు టెస్టుల్లో కేవలం మూడే ఆడగలగడం ఇప్పుడు భారత జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. మిగతా రెండు మ్యాచ్‌లు ఏవో ఇంకా నిర్ణయించలేదని, సిరీస్‌ను కొనసాగుతున్న సమయంలో నిర్ణయం తీసుకుంటామని బుమ్రా చెప్పాడు.
"మూడు టెస్టులే నేను ఆడగలుగుతున్నాను. వర్క్ లోడ్ ను దృష్టిలో పెట్టుకుని ముందుగా నిర్ణయించుకుంటే మేలని భావిస్తున్నాను. ఒక కెప్టెన్‌గా, మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాను అంటే, అది టీమ్‌పై సరైన సందేశం ఇవ్వదు. కాబట్టి, ఆటగాడిగా నేనున్నప్పుడే నా శక్తిమేరకు బాగా ఆడాలని చూస్తున్నాను" అని బుమ్రా పేర్కొన్నాడు.
బుమ్రా గతంలో ఎన్నో గాయాలను ఎదుర్కొన్నాడు. 2024-25 బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడిన బుమ్రా, చివరి టెస్టులో వెన్నుపోటు గాయంతో మూడున్నర నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేడు. అంతకుముందు, 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు బుమ్రా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఫిట్ కావడానికి 2023 మార్చిలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు.