ఐపీఎల్ కంటే ముందే వస్తున్న జస్ప్రిత్ బుమ్రా! లంకతో వన్డే సిరీస్‌కి ఎంపికైన స్టార్ పేసర్...

By Chinthakindhi RamuFirst Published Jan 3, 2023, 4:27 PM IST
Highlights

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న జస్ప్రిత్ బుమ్రా... శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకి చోటు కల్పించిన సెలక్టర్లు... 

టీమిండియా ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ ఇది. కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండంటే రెండు మ్యాచులు ఆడి తిరిగి గాయపడ్డాడు. వెన్నుగాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా... శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

జస్ప్రిత్ బుమ్రాని శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చేరుస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. వెన్ను గాయానికి చికిత్స తీసుకున్న జస్ప్రిత్ బుమ్రా, పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టుగా జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా...

NEWS - The All-India Senior Selection Committee has included pacer Jasprit Bumrah in India’s ODI squad for the upcoming Mastercard 3-match ODI series against Sri Lanka.

More details here - https://t.co/hIoAKbDnLA

— BCCI (@BCCI)

గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కి దూరమైన మహ్మద్ షమీ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షమీ, బుమ్రాలతో పాటు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా ఎంపికయ్యారు...

బుమ్రా రీఎంట్రీతో ఉమ్రాన్ మాలిక్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన 20 మంది కోర్ టీమ్‌ని ఎక్కువ మ్యాచులు ఆడించాలని చూస్తోంది భారత జట్టు...

జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ సమయానికి పూర్తిగా ఫిట్‌నెస్ సాధించే పనిలో భాగంగా లంకతో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

శ్రీలంకతో టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జనవరి 10 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. జనవరి 10న గౌహతిలో తొలి వన్డే ఆడే భారత జట్టు, జనవరి 12న కోల్‌కత్తాలో రెండో వన్డే, జనవరి 15న తిరువనంతపురంలో మూడో వన్డే ఆడుతుంది...

జస్ప్రిత్ బుమ్రా చేరిన తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత జట్టు ఇలా ఉంది:రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

click me!