కోటీశ్వరుల బిడ్డ తలుచుకుంటే కానిదేముంది... సొంత గ్రౌండ్‌లో అభిమన్యు ఈశ్వరన్ రేర్ ఫీట్...

By Chinthakindhi RamuFirst Published Jan 3, 2023, 2:40 PM IST
Highlights

డెహ్రాడూన్‌లో అభిమన్యు ఈశ్వరన్‌ పేరుతో స్టేడియం నిర్మించిన ఆయన తండ్రి రంగనాథన్ ఈశ్వరన్... సొంత గ్రౌండ్‌లో రంజీ మ్యాచ్ ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్... 

కోటిశ్వరుల బిడ్డ తలుచుకుంటే కానిదేముంది... కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా బలగంతో పట్టుకువచ్చేస్తాడు తండ్రి. ఇప్పుడు భారత క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ కారణంగా అరుదైన ఘనత సాధించాడు.  వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ పేరిట అంటీఘాలో ఓ క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే బ్రియాన్ లారా పేరుతలో ట్రిడినాడ్ అండ్ టొబాగోలో స్టేడియాన్ని నిర్మించారు.. బ్రిస్బేన్‌లో ఆలెన్ బోర్డర్ పేరుతో క్రికెట్ స్టేడియం ఉంది.

అయితే ఈ క్రికెటర్లు అందరూ క్రికెట్‌లో ఎంతో సాధించి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక... క్రికెట్ ఫీల్డ్‌లో వాళ్లు సాధించిన ఘనతలకు గుర్తింపుగా గౌరవంగా స్టేడియాలకు వారి పేర్లను పెట్టారు. అయితే భారత క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, తన పేరుతో నిర్మించిన స్టేడియంలో మ్యాచ్ ఆడి అరుదైన ఫీట్ సాధించాడు...

అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్, ఛార్టెడ్ అకౌంటెంట్. క్రికెట్‌పై ఎంతో ప్రేమ ఉన్న రంగనాథన్, తన కొడుకుని క్రికెటర్‌గా చూడాలని ఎన్నో కలలు కన్నాడు. చిన్నతనం నుంచే అభిమన్యు ఈశ్వరన్‌కి క్రికెట్ మెలకువలు నేర్పుతూ పెంచాడు... వ్యాపార సామ్రాజ్యంలో దిగి, కొన్ని కోట్లు ఆర్జించిన రంగనాథన్, కొడుకు కోసం డెహ్రాడూన్‌లో వేల ఎకరాలు కొనుగోలు చేశాడు...

దీనిపై కొన్నికోట్లు ఖర్చు చేసి, స్టేడియం నిర్మించాడు. ఇంత కష్టపడి కట్టించిన స్టేడియానికి సచిన్ టెండూల్కర్ పేరో, విరాట్ కోహ్లీ పేరో పెట్టడం ఎందుకని కొడుకు అభిమన్యు ఈశ్వరన్ పేరే పెట్టాడు. క్లబ్ క్రికెట్ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన అభిమన్యు క్రికెట్ స్టేడియం... ప్రస్తుతం రంజీ మ్యాచులకు ఆతిథ్యం ఇస్తోంది...

బెంగాల్, ఉత్తరాఖండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అభిమన్యు స్టేడియంలో అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనర్‌గా వచ్చాడు.  158 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  మంచుతో ప్లేయర్లు కనిపించకపోవడంతో మ్యాచ్‌ని అంతరాయం కలిగింది.

‘నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే క్రికెట్ ఆడడం నేర్చుకున్నా. ఇప్పుడు రంజీ గేమ్ ఆడుతుండడం చాలా గర్వంగా ఉంది. మా నాన్న ప్రేమకు, కష్టానికి దక్కిన ఫలితం ఇది...’ అంటూ చెప్పుకొచ్చాడు అభిమన్యు ఈశ్వరన్...

27 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 15 సెంచరీలు సాధించాడు. 2020-21 ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి ప్రకటించిన జట్టులోనూ ఉన్నాడు. అయితే అభిమన్యుకి తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. 

ఇప్పటిదాకా 70 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అభిమన్యు ఈశ్వరన్, 15 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4841 పరుగులు చేశాడు. 62 లిస్టు ఏ మ్యాచులు, 21 టీ20 మ్యాచులు ఆడిన అభిమన్యు ఈశ్వరన్, ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో చేరడం విశేషం...

click me!