దంచికొట్టిన సూర్య, ఇషాన్ కిషన్... భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్...

Published : May 03, 2023, 11:12 PM IST
దంచికొట్టిన సూర్య, ఇషాన్ కిషన్... భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్...

సారాంశం

IPL 2023: సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు... సిక్సర్‌తో ముగించిన తిలక్ వర్మ.. 18.5 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన ముంబై ఇండియన్స్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో 200+ స్కోరు ఇచ్చిన ముంబై ఇండియన్స్, వరుసగా రెండో మ్యాచ్‌లో ఆ టార్గెట్‌ని ఊదేసింది. రోహిత్ డకౌట్ అయినా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కలిసి మూడో వికెట్‌కి 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ముంబైకి ఘన విజయం అందించారు..  

215 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. 3 బంతులు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ, రిషి ధావన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో రోహిత్‌కి ఇది 15వ డకౌట్. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

18 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్..

ఈ దశలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి బౌండరీల మోత మోగించారు. సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 6, 4, 4 బాదిన సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.. 

29 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో 6, 4, 4 బాదాడు. ఈ ఇద్దరూ బౌండరీలతోనే ఢీల్ చేయడంతో చివరి 5 ఓవర్లలో ముంబై ఇండియన్స్ విజయానికి 45 పరుగులే కావాల్సి వచ్చాయి..

31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిషీ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

అయితే అర్ష్‌దీప్ సింగ్ ఓవర్‌లో 6, 4, 6 బాదిన తిలక్ వర్మ, మ్యాచ్‌ని మళ్లీ ముంబై వైపు మళ్లించాడు. 10 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన తిలక్ వర్మ, సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించగా టిమ్ డేవిడ్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఈ దశలో శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

20 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.  4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ కెరీర్‌లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జితేశ్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, లియామ్ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు,  4 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 53 బంతుల్లో 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు