ఇదో చెత్త మ్యాచ్.. క్రికెట్‌లో చీకటి రోజు : భారత్-పాక్ పోరుపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు

By Srinivas MFirst Published Aug 29, 2022, 5:09 PM IST
Highlights

Asia Cup 2022: భారత్-పాక్ మ్యాచ్ పై అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఓటమితో  అక్తర్ ఇలా మాట్లాడుతున్నాడని.. ఒకవేళ గెలిచిఉంటే ఇలా కామెంట్స్ చేసేవాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.  క్రికెట్ ఫ్యాన్స్ ను అసలైన మజాను పంచిన ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదో చెత్త మ్యాచ్ అని అభివర్ణించాడు. రెండు జట్లు ఓటమి కోసమే ఆడాయే తప్ప గెలవాలనే కసి ఏ ఒక్క జట్టులోనూ కనిపించలేదని అన్నాడు. మ్యాచ్ అనంతరం అతడు తన యూట్యూబ్  ఛానెల్ లో మాట్లాడుతూ  షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

అక్తర్ మాట్లాడుతూ.. ‘నేను భారత్, పాక్ రెండింటినీ అభినందించాలనుకుంటున్నాను. ఎందుకంటే రెండు జట్లూ  మ్యాచ్ ఓడేందుకు శాయశక్తులా కృషి చేశాయి. ఆ ప్రయత్నంలో భారత్ దాదాపుగా విజయం సాధించింది. ఆ జట్టు మ్యాచ్ ఓడటానికి ఎంతో కృషి చేసింది. చివర్లో హార్ధిక్ పాండ్యా ఆదుకోవడం వల్ల మ్యాచ్ భారత్ వశమైంది లేకుంటే కథ మరోలా ఉండేది.

ఇక పాకిస్తాన్ ఆటగాళ్ల గురించి నాకు మాటలు చాలడం లేదు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ను ఎలా విశ్లేషించాలో నాకైతే అర్థం కావడం లేదు. అతడి అతి జాగ్రత్త కారణంగా తొలి పవర్ ప్లేలో 19 బంతులు వృథా చేయాల్సి వచ్చింది. టీ20లో ఇన్ని డాట్ బాల్స్ అయితే  మీకు తిప్పలు తప్పవు..’ అని అన్నాడు. 

జట్టు ఎంపికపైనా అక్తర్ ఇరు జట్లనూ నిందించాడు. రెండు జట్లూ జట్టు కూర్పును సరిగా వాడుకోలేదంటూ ఆరోపించాడు.  రోహిత్ శర్మ.. రిషభ్ పంత్ ను ఆడించకపోవడంపై విమర్శలు గుప్పించాడు. ‘రెండు టీముల్లోనూ జట్టు కూర్పు ఏమీ బాగోలేదు. భారత్ రిషభ్ పంత్ ను తొలగించింది. రవీంద్ర జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపింది. దీనిని బట్టి బ్యాటింగ్ సెలక్షన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇక పాకిస్తాన్  కూడా తక్కువ తిన్లేదు.  నాలుగో స్థానంలో ఆ జట్టు ఇఫ్తికర్ అహ్మద్ ను పంపింది. ఇది సరైన ఎంపిక కాదు. అతడి బదులు మరోకరిని పంపిస్తే బాగుండేది. అసిఫ్ అలీని కాదని షాదాబ్ ఖాన్ ను ముందుకు పంపారు. ఇది కూడా విఫల ప్రయోగమే. ఇక బాబర్ ఆజమ్ టీ20లలో ఓపెనింగ్ బ్యాటర్ గా రాకూడదని నేను చాలాకాలంగా మొత్తుకుంటున్నా. అయినా ఎవరూ నా మాట వినడం లేదు. ఇక చివరి ఓవర్ స్పిన్నర్ తో వేయించడం అంటే ఆ జట్టు వ్యూహాల లోపం అర్థమవుతూనే ఉన్నది. ప్రత్యేకించి ఈ మ్యాచ్ లో బాబర్ ఏ మైండ్ సెట్ తో ఆడాడనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నా... 

ఒక రకంగా చెప్పాలంటే  ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పేలవంగా సాగింది. ఇది నిజంగా చెత్త క్రికెట్. క్రికెట్ చరిత్రలో ఇదొక చీకటి రోజు. రెండు జట్లు అధ్వాన్నంగా ఆడాయి. నాకైతే ఈ మ్యాచ్ అస్సలు నచ్చలేదు. మిగతావాళ్లు ఏం మాట్లాడుతున్నారనేది నాకు అనవసరం...’ అని ఘాటుగా స్పందించాడు. 

అయితే అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఓటమితో  అక్తర్ ఇలా మాట్లాడుతున్నాడని.. ఒకవేళ గెలిచిఉంటే ఇలా కామెంట్స్ చేసేవాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొసలి కన్నీరు కార్చడం ఆపితే అందరికీ మంచిదని చురకలు అంటిస్తున్నారు. 

click me!