అందుకే ఓడిపోయాం: మూడో వన్డే ఫలితంపై ఆరోన్ ఫించ్

By telugu teamFirst Published Jan 20, 2020, 12:10 PM IST
Highlights

బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కోహ్లీ సేనపై తమ ఓటమికి గల కారణాలను ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వివరించాడు. తాము వేసుకున్న ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయామని ఆయన చెప్పాడు.

బెంగళూరు: ఇండియాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో తమ ఓటమికి గల కారణాలపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడాడు. తమ ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోవడం వల్లనే ఓడిపోయామని ఆయన అన్నాడు. భారత్ పై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.

మొదట బ్యాటింగ్ చేసి మూడు వందలకు పైగా పరుగులు సాధించాలనే తమ ప్రణాళిక అమలు కాలేదని, దాంతో మ్యాచును కాపాడుకోలేకపోయామని ఆయన అన్నాడు. చివరి వన్డేలో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించిందని, చివరి వరకు స్పిన్ కు అనుకూలంగానే ఉందని ఆయన అన్నాడు. 

Also Read: మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ

అయితే తాము భారీ స్కోరు చేయలేకపోయామని, తాము 310 పరుగులు చేసి ఉింటే తమ స్పిన్నర్లు భారత బ్యాట్స్ మెన్ పై మరింత ఒత్తిడి పెట్టేవారని, అగర్ బౌలింగు చాలా బాగుందని ఫించ్ అన్నాడు. లైన్ అండద్ లెంగ్త్ బంతులతో బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు.

దానివల్ల అగర్ బౌలింగును ఆడడానికి భారత బ్యాట్స్ మెన్ రిస్క్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. తాము స్వల్ప విరామాల్లో రెండేసి వికెట్లను కోల్పోవడం కూడా భారీ స్కోరు చేయలేకపోవడానికి ఒక కారణమని ఆయన అన్నాడు.

పార్ట్ టైమ్ స్పిన్ వర్కౌట్ అవుతుందని తాను అనుకున్నానని, దాంతో లబూ షేన్ తో బౌలింగ్ చేయించడమే కాకుండా తాను కూడా బౌలింగ్ చేశానని, కానీ ఆ ప్రణాళిక ఫలించలేదని అన్నాడు. ఈ సిరీస్ ఓటమి తమకు చాలా విషయాలు నేర్పిందని చెప్పాడు. 

Also Read: రాహుల్ ఔటైన తర్వాత కోహ్లీకి అదే చెప్పా: రోహిత్ శర్మ

స్వదేశంలో భారత్ అత్యంత బలమైన జట్టు అని మరోసారి రుజువైందని ఆయన అన్నాడు. ప్రపంచ అత్యుత్తమ జట్టును, అందులోనూ వారి సొంత గడ్డపై ఓడించాలంటే ఎంత కష్టమో తమకు తెలిసి వచ్చిందని ఫించ్ అన్నాడు.

click me!