IND vs SA: ఓపెనర్లు హిట్టు.. మిడిలార్డర్ ఫట్టు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..

Published : Jun 14, 2022, 08:41 PM IST
IND vs SA: ఓపెనర్లు హిట్టు.. మిడిలార్డర్ ఫట్టు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..

సారాంశం

IND vs SA T20I: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఊరించి ఉసూరుమనిపించింది. తొలుత ఓపెనర్లు ధాటిగా ఆడి పది ఓవర్లకే వంద పరుగులు చేయగా.. తర్వాత పది ఓవర్లలో  80 పరుగులు కూడా రాలేదు.   

విశాఖ తీరాన  ఇండియా-సౌతాఫ్రికా నడుమ సాగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్ లో ఊరించి ఉసూరుమనిపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాధిని మిడిలార్డర్ అందుకోలేక చతికిలపడింది.  ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లు రాకెట్ స్పీడ్ తో స్కోరు చేస్తే ఆ తర్వాత వచ్చినోళ్లు ఫోర్ కొట్టడానికే ఇబ్బంది పడ్డారు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.  ఇక భారమంతా బౌలర్లదే. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు)  శుభారంభం అందించారు.  తొలి రెండు మ్యాచులలో ఇషాన్ హిట్టింగ్ కు దిగగా ఈ మ్యాచ్ లో ఆ బాధ్యతను రుతురాజ్ తీసుకున్నాడు.

రబాడా వేసిన మూడో ఓవర్లో  4,6 కొట్టిన గైక్వాడ్.. నోర్త్జ్ కు చుక్కలు చూపించాడు. అతడు వేసిన నాలుగో ఓవర్లో వరుసగా నాలుగు బంతులను బౌండరీ లైన్ దాటించాడు. ఒక బంతికి లెగ్ బై ద్వారా ఫోర్ వచ్చింది.  ప్రిటోరియస్ వేసిన ఆరో ఓవర్లో గైక్వాడ్ మరో సిక్సర్ కొట్టాడు.  ఫలితంగా 6 ఓవర్లకే ఇండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. 

ఆ తర్వాత బాదడం ఇషాన్ కిషన్ వంతు  అయింది.  8వ ఓవర్లో కిషన్.. 6,4 తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అదే ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసిన గైక్వాడ్..  అంతర్జాతీయ టీ20 కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కానీ కేశవ్ మహారాజ్ వేసిన పదో ఓవర్ ఆఖరి బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

గైక్వాడ్ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (14).. వస్తూనే సిక్సర్ కొట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. షంషీ వేసిన 13వ ఓవర్లో నోర్త్జ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఇషాన్ కిషన్ కూడా ప్రిటోరియస్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి  హెండ్రిక్స్ కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (6) మరోసారి విఫలమయ్యాడు.  

 

ఓపెనర్లు ఉన్నప్పుడు రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన టీమిండియా స్కోరు.. ఆ తర్వాత నెమ్మదించింది. ఒక క్రమంలో 31 బంతుల దాకా బౌండరీనే రాలేదు. చివర్లో దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. క్రీజులో దినేశ్ కార్తీక్ (6), హార్ధిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్.. 4 ఫోర్లు) ఉన్నా పరుగుల రాక గగనమైంది. కానీ ఆఖరి ఓవర్లో పాండ్యా విజృంభించి ఆడటంతో భారత్ ఫైటింగ్ టోటల్ చేయగలిగింది. 

తొలి పది ఓవర్ల పాటు భారీగా పరుగలిచ్చిన దక్షిణాఫ్రికా బౌలర్లు ఆఖర్లో మెరుగయ్యారు.  ప్రిటోరియస్ కు 2 వికెట్లు దక్కగా.. షంషీ, కేశవ్ మహారాజ్, రబాడాకు తలో వికెట్ దక్కింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !