
ఇండియా-సౌతాఫ్రికా సిరీస్ కు ముందు భారత్ కు టీ20 లలో ఘనమైన రికార్డు. వరుసగా 12 మ్యాచుల్లో విజయం. 13వ మ్యాచ్ కూడా గెలిచి ప్రపంచ రికార్డు సృష్టిస్తుందనకుంటే.. వారం రోజుల్లోనే అంతా తలకిందులైంది. రికార్డు ఎలాగూ పోయింది. ఇప్పుడు సఫారీలతో స్వదేశంలో సిరీస్ కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది టీమిండియా. ఢిల్లీ, కటక్ లలో ఓడిన రిషభ్ పంత్ సేన.. వైజాగ్ లో మూడో టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికాతో కీలక పోరులో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్ కు రానుంది.
తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో మెరుగ్గా రాణించినా రెండు మ్యాచ్ లో టీమిండియాకు అది కూడా లోపించింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. నేడు కీలక మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో వాళ్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరం.
బ్యాటింగ్ ఎలా ఉన్నా బౌలింగ్ మాత్రం టీమిండియా అభిమానులను దారుణంగా నిరాశకు గురిచేస్తున్నది. భువనేశ్వర్ మినహా మిగిలిన బౌలర్లంతా విఫలమవుతున్నారు. ఐపీఎల్ లో రాణించిన అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ చేతులెత్తేస్తున్నారు. ఇక ఉపఖండపు పిచ్ లపై స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ లు విఫలమవుతుండటం భారత్ ను కలవరపరుస్తున్న అంశం. వీటన్నింటికీ తోడు అనుభవలేమి, రిషభ్ పంత్ కెప్టెన్సీ అనుభవరాహిత్యం టీమిండియాను దారుణంగా వేధిస్తున్నాయి.
మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం వరుసగా రెండు మ్యాచులు గెలిచిన ఉత్సాహంలో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నది. ఐపీఎల్ ఫామ్ ను డేవిడ్ మిల్లర్ కంటిన్యూ చేస్తున్నాడు. అతడితో పాటు తొలి మ్యాచ్ లో దాటిగా ఆడిన డసెన్ తో పాటు రెండో మ్యాచ్ గెలిపించిన క్లాసెన్ లను అడ్డుకోపోతే టీమిండియాకు భారీ ఓటమి తప్పదు. బౌలింగ్ లో నోర్త్జ్, రబాడా, పార్నెల్, షంషీలు అంచనాలకు మించి రాణిస్తున్నారు.
ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికాతో పాటు ఇండియా జట్టులో కూడా మార్పులేమీ లేవు.
తుది జట్లు :
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్
దక్షిణాఫ్రికా: టెంబ బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వేన్ ప్రిటోరియస్, డసెన్, క్లానెన్, డేవిడ్ మిల్లర్, పార్నెల్, కగిసొ రబాడా, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్త్జ్, షంషీ