
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ నిషేధిత మందులు వాడాడా..? టీ20 ప్రపంచకప్ సెమీస్ కు ముందు ఛాతి సమస్యతో బాధపడ్డ అతడు ఆస్పత్రిలో చేరడం.. అక్కడ్నుంచి డిశ్చార్జి అవడం.. ఆసీస్ తో మ్యాచ్ ఆడి అందులో రాణించడం.. అతడు ఆస్పత్రిలో ఉన్న విషయం మ్యాచ్ ఓడిన తర్వాత ప్రపంచానికి తెలియడం.. ఇవన్నీ ఓ సంచలనంగా మారాయి. సెమీస్ లో ఆసీస్ తో మ్యాచ్ కు ముందు రిజ్వాన్ కోలుకోవడమే గగనమంటే ఏకంగా అతడు ఆ మ్యాచ్ ఆడటమే గాక 52 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. అయితే మ్యాచ్ కు ముందు అతడు నిషేధిత మందులు వాడాడని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డాక్టర్ నజీబుల్లా సుమ్రో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నజీబుల్లా మాట్లాడుతూ... ‘ఆరోజు రిజ్వాన్ కనీసం శ్వాస తీసుకునే పరిస్థితులలో కూడా లేడు. అతడు కోలుకోవడం చాలా కష్టం. అదే విషయం అతడితో కూడా చెప్పాను. కానీ రిజ్వాన్ మాత్రం తాను ఎలాగైనా ఈ మ్యాచ్ ఆడాలని నాతో చెప్పాడు...
దీంతో అతడిని ఓ నిషేధిత మెడిసన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిని అథ్లెట్లకు ఇవ్వడానికి అనుమతి లేదు. క్రికెట్ లో దానిని వాడాలంటే తప్పకుండా ఐసీసీ అనుమతి తీసుకోవాలి. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే ఆ మెడిసన్ ను రిజ్వాన్ కు ఇచ్చాం..’ అని తెలిపాడు.
నజీబుల్లా చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐసీయూ నుంచి నేరుగా మ్యాచ్ కు వచ్చి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడని అప్పట్లో రిజ్వాన్ పోరాటం గురించి గొప్పగా మాట్లాడినోళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలాఉండగా.. రిజ్వాన్ కు నిషేధిత మెడిసన్ ఇచ్చామన్న నజీబుల్లా దాని పేరును వెల్లడించలేదు. అంతేగాక ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన ఉన్నా దానిని తీసుకున్నారా..? లేదా..? అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఏదేమైనా ఈ అంశం పాకిస్తాన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేదే అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ దశలో భారత్ తో పాటు న్యూజిలాండ్ నూ ఓడించి అపజయమన్నదే లేకుండా సెమీస్ చేరిన పాక్.. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్య పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ లో షాహిన్ అఫ్రిది వేసిన 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ జారవిడవడం తర్వాత.. వేడ్ వరుస బంతుల్లో సిక్సర్లు బాది ఆ జట్టును సెమీస్ కు చేర్చడం పాక్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేని విషాదం.