
ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ తో తలపడిన తొలి మ్యాచ్ లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. హైదరాబాద్ ను 67 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆ జట్టు సారథి డుప్లెసిస్ ఓపెనర్ గా వచ్చి చివరివరకు నాటౌట్ గా నిలిచాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ మధ్యలో అతడు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చేసినట్టుగానే రిటైర్డ్ ఔట్ (లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో) అవుదామని అనుకున్నానని అన్నాడు. చివర్లో పరుగుల రాక కష్టమైన సమయంలో తాను రిటైర్డ్ ఔటై.. దినేశ్ కార్తీక్ ను క్రీజులోకి రప్పిద్దామనుకున్నానని తెలిపాడు.
సన్ రైజర్స్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘అతడు (దినేశ్ కార్తీక్) ఇలా సిక్సర్లు కొడతాడని మేం ఊహించి ఉంటే నేను ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్ అవుదామనుకున్నా. మా ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి నేను చాలా అలిసిపోయాను...
నేను ఇక రిటైర్డ్ ఔట్ అయి పెవిలియన్ కు వెళ్దామనుకున్నా. కార్తీక్ ను బరిలోకి దించితే సిక్సర్లతో స్కోరు బోర్డుకు ఊపుతీసుకువస్తాడు. కానీ అదే సమయానికి మ్యాక్స్వెల్ ఔటయ్యాడు. దీంతో ఆ స్థానంలో షాబాజ్ రావాల్సి ఉన్నా దినేశ్ ను ముందుకు పంపాం. మా అంచనాలను తగ్గట్టుగానే డీకే.. దుమ్ము దులిపాడు. మా స్కోరును భారీగా పెంచాడు. అతడి క్యాచ్ సన్ రైజర్స్ ఆటగాళ్లు డ్రాప్ చేయడం కూడా మాకు కలిసొచ్చింది...’ అని చెప్పాడు.
సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆఖరి పది బంతులు ఉన్నాయనగా దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. 8 బంతుల్లోనే 1 బౌండరీ, 4 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. కార్తీక్ దూకుడుగా ఆడటంతోనే ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి ఓవర్ వేసిన ఫరూఖీ బౌలింగ్ లో డీకే.. 25 పరుగులు పిండుకున్నాడు.
కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ బ్యాటర్లు తడబడ్డారు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే ఓపెనర్లు (విలియమ్సన్, అభిషేక్ శర్మ) డకౌట్ అయ్యారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (58) ఒక్కడే కాస్త ఆదుకున్నా అతడికి మిగిలిన బ్యాటర్ల సహకారం అందలేదు. ఫలితంగా సన్ రైజర్స్.. 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 5 వికెట్లు పడగొట్టాడు.