ఆఖరికి ఆ ముద్ర కూడా పడిందా..? టీమిండియాకు ఏంటీ ఖర్మ..!

Published : Nov 11, 2022, 04:53 PM IST
ఆఖరికి ఆ ముద్ర కూడా పడిందా..? టీమిండియాకు ఏంటీ ఖర్మ..!

సారాంశం

Team India: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో ఓటమి భారత క్రికెట్ జట్టుపై దారుణంగా పడింది. ఈ ఓటమితో భారత్  కు అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ కోరుకోని ముద్ర కూడా దక్కేట్టు ఉంది. 

అంతర్జాతీయ క్రికెట్ లో దక్షిణాఫ్రికా క్రికెట్ కు మంచి పేరు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో తీసుకున్నా ఆ జట్టుకు తిరుగులేదు.  ప్రపంచ స్థాయి బౌలర్లు, అగ్రశ్రేణి బ్యాటర్లు, ఫీల్డ్ లో పాదరసంలా కదిలే ఫీల్డర్లు  వాళ్ల సొంతం.  ద్వైపాక్షిక సిరీస్ లలో ఆ జట్టు సాధించిన విజయాలు కోకొల్లలు. కానీ ఆ జట్టుకు ఉన్న శాపమో ఏమో గానీ ఐసీసీ టోర్నీలంటేనే దక్షిణాఫ్రికాకు అచ్చిరావు. కొన్నిసార్లు అదృష్టం బాగోలేక.. పలుమార్లు సరిగా ఆడక.. ఐసీసీ టోర్నీలలో అందుకే ఆ జట్టును  ‘చోకర్స్’గా వ్యవహరిస్తుంటారు. 

స్థూలంగా చెప్పాలంటే క్రికెట్ లో చోకర్స్ అంటే.. ఒక టోర్నీ లేదా గేమ్ లో బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగినా అందరి  అంచనాలను తలకిందులు చేస్తూ ఓడటం. దక్షిణాఫ్రికా 1992 ప్రపంచకప్ నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉంది.  ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో మరో కొత్త చోకర్స్ వచ్చారా..? అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ ‘చోకర్స్ టీమ్’ మరేదో కాదు. టీమిండియానే.. 

ఎందుకు ఆ ముద్ర..? 

సౌతాఫ్రికాతో పోలిస్తే ఐసీసీ టోర్నీలలో భారత్ కు మంచి రికార్డు ఉంది. రెండు వన్డే ప్రపంచకప్ లు, ఒక టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. కానీ 2013 నుంచి భారత జట్టు ఐసీసీ టోర్నీలలో దారుణంగా విఫలమవుతున్నది. ఆ పరంపరను ఓసారి పరిశీలిస్తే.. 

- 2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్.. అప్పటిదాకా టోర్నీలో అదరగొట్టిన భారత జట్టు ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓడింది. 
- 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. 
- 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో పరాభవం 
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో  పాకిస్తాన్  చేతిలో దారుణ అవమానం. 
- 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి 
- 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ లోనూ కివీస్ చేతిలో భంగపాటు 
- 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి 

 

గణాంకాలన్నీ భారత్ కు  వ్యతిరేకంగానే ఉన్నాయి. లీగ్ స్టేజీలలో రాణించడం తీరా  నాకౌట్ దశలో దారుణంగా విఫలమవడం టీమిండియాను కలవరపెడుతున్నది. కోహ్లీ వల్ల కావడం లేదని సారథిని మార్చి రోహిత్ ను తీసుకొచ్చినా భారత ప్రయాణం సెమీస్ వద్దే ఆగింది. మరి భారత్ ఈ గండం దాటేదెన్నడో..!!


 

PREV
click me!

Recommended Stories

SRH Dangerous Batsmen : ఇషాన్ నుండి అభిషేక్ వరకు.. IPL 2026 లో టాప్ 5 డేంజర్ బ్యాటర్లు, లిస్ట్ లో ఒకేఒక్క తెలుగోడు
Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే