BCCI Selection Committee: గతేడాది యూఏఈలో టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ లోనే వైదొలిగిన భారత్.. ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెగా టోర్నీలో కూడా టైటిల్ సాధించడంలో విఫలమైంది. దీంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు తప్పేలా లేదు.
వరుసగా రెండేండ్లలో ఐసీసీ టోర్నీలలో టీమిండియా వైఫల్యాలతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మీద వేటు తప్పేలా లేదు. గతేడాది యూఏఈలో టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ స్టేజ్ లోనే వైదొలిగిన భారత్.. ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెగా టోర్నీలో కూడా టైటిల్ సాధించడంలో విఫలమైంది. దీంతో చేతన్ శర్మ సారథ్యంలోని నలుగురు సభ్యుల ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు తప్పదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వచ్చే మూడేండ్లలో కూడా మూడు ఐసీసీ టోర్నీలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇకనైనా కళ్లు తెరువనుందని క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.
తాజా సమచారం ప్రకారం.. చేతన్ శర్మ అండ్ కో. కు టీమిండియా ఓటమితో మూడినట్టేనని, త్వరలోనే బీసీసీఐ నియమించే క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కొత్త సెలక్షన్ కమిటీని సూచించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తున్నది.
undefined
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘అవును, ఈ ఓటమి తర్వాత కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. ఈ మెగా టోర్నీకి ముందే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఎవరో ఒకరి మీద నింద వేయడం సరికాదు. కానీ వాళ్లు (సెలక్టర్లు) కూడా సిస్టమ్ లో భాగంగా ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పాల్సిందే. కొత్త సీఏసీ నియామకం తర్వాత భారీ మార్పులైతే ఉంటాయి..’ అని తెలిపారు.
సెలక్టర్ల తప్పేంటి..?
- ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్న వారిని ప్రపంచకప్ తో పాటు కీలక సిరీస్ లలో పట్టించుకోకపోవడం.
- హర్షల్ పటేల్ ను టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. చాహల్ దీ అదే పరిస్థితి.
- అశ్విన్, షమీలను టీ20లలో పట్టించుకోలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ భారత్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు. నేరుగా ఆసీస్ కు వెళ్లి టోర్నీ ఆడాడు. అశ్విన్ అడపాదడపా కనిపిస్తున్నా అతడిని ఈ టోర్నీలో భారత్ ఆడిన ప్రతీ మ్యాచ్ లో ఆడించారు.
- కీలక ఆటగాళ్లు గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోవడం. బుమ్రా గాయపడితే దిక్కులేక షమీ వైపు చూశారే గానీ అతడిని రిప్లేస్ చేసే బౌలర్ ను తయారుచేయలేదు.
- కెఎల్ రాహుల్ విషయంలో సెలక్టర్లు చేసింది ముమ్మాటికీ తప్పే అని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడకున్నా అతడిని కొనసాగించడం.. వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం వంటివి తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.
- ఈ టోర్నీలో ప్రతీ జట్టు కనీసం నలుగురు పేసర్లతో బరిలోకి దిగాయి. ఆస్ట్రేలియా లో బౌన్సీ పిచ్ లకు అనుకూలంగా వారి జట్టును సెట్ చేసుకున్నాయి. బుమ్రా గాయం కారణంగా సెలక్టర్లు ఆస్థాయి పేసర్ ను ఎంపిక చేయలేదు. ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్ లను పట్టించుకోలేదు.
తిలా పాపం తలా పిడికెడు..
భారత ఓటమికి కారణం గంపగుత్తగా సెలక్టర్ల మీద వేయడానికి కూడా లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్న విధంగా బీసీసీఐ కూడా ఇందులో భాగం పంచుకోవాల్సిందే. ఐదుగురితో ఉండాల్సిన సెలక్షన్ కమిటీ నలుగురికే పరిమితమైంది. సెలక్టర్ అబే కురువిల్లా పదవీకాలం ముగియడంతో గత కొద్దికాలంగా ఆ పోస్టు ఇంకా నింపలేదు. త్వరలో దేబశీశ్ మెహంతి పదవీకాలం కూడా ముగియనుంది. కానీ బీసీసీఐ మాత్రం దీని మీద అంత శ్రద్ధ వహించలేదు.
టెస్టులు, వన్డేలే కాదు.. టీ20లు ముఖ్యమే..
సాధారణంగా సెలక్షన్ కమిటీలోకి తీసుకునే సభ్యులు గతంలో భారత జట్టుకు టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారా..? లేదా..? అనేది చూస్తారు. కానీ ప్రస్తుతమున్న నలుగురిలో ఒక్క సెలక్టర్ కూడా టీ20 ఆడలేదు. ఆ అనుభవం కూడా లేదు. దీంతో టీ20లలో భారత జట్టు బొక్క బోర్లా పడుతుందనేది క్రికెట్ పండితుల వాదన. దీంతో ఈసారి నియమించబోయే సెలక్షన్ కమిటీలో టీ20 అనుభవమున్న వ్యక్తిని సెలక్టర్ గా నియమించాలని వారంతా బీసీసీఐకి సూచిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సెలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేయాల్సిందేననే అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుత సెలక్షన్ కమిటీ సభ్యులు..
- చేతన్ శర్మ (భారత్ తరఫున 23 టెస్టులు, 65 వన్డేలు, 121 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు)
- సునీల్ జోషి (15 టెస్టులు, 69 వన్డేలు, 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు)
- దెబశీశ్ మెహంతి (2 టెస్టులు, 45 వన్డేలు, 117 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు)
- హర్విందర్ సింగ్ ( 3 టెస్టులు, 16 వన్డేలు, 109 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు)