ఇరానీ ట్రోఫీ 2023 విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా... ఒకే ఏడాదిలో రెండోసారి టైటిల్ కైవసం..

By Chinthakindhi Ramu  |  First Published Oct 3, 2023, 8:35 PM IST

సౌరాష్ట్రతో మ్యాచ్‌లో 175 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్... నాలుగో ఇన్నింగ్స్‌లో 79 పరుగులకి ఆలౌట్ అయి, చిత్తుగా ఓడిన సౌరాష్ట్ర.. 


ఇరానీ ట్రోఫీ 2023 టోర్నీని రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌ సొంతం చేసుకుంది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్ 94.2 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

సాయి సుదర్శన్ 72 పరుగులు చేయగా శ్రీకర్ భరత్ 36 పరుగులు చేశాడు. కెప్టెన్ హనుమ విహారి 33 పరుగులు చేయగా మయాంక్ అగర్వాల్ 32, సర్ఫరాజ్ ఖాన్ 17, యశ్ ధుల్ 10, శామ్స్ ములానీ 32, సౌరబ్ కుమార్ 39, పుల్‌కిత్ నారంగ్ 12, నవ్‌దీప్ సైనీ 9 పరుగులు చేశారు. 

Latest Videos

undefined

సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 83.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 214 పరుగులకి ఆలౌట్ అయ్యింది. హర్వీన్‌ దేశాయ్ డకౌట్ కాగా చిరాగ్ జాని 2, సమర్థ్ వ్యాస్ 29, ఛతేశ్వర్ పూజారా 29, షెల్డన్ జాక్సన్ 13, అర్పిత్ వసవద 54, ప్రేరక్ మన్కడ్ 20, పార్థ్ బుట్ 20, కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కట్ 19 పరుగులు చేశారు..

రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు, 52 ఓవర్లలో 160 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సాయిసుదర్శన్ 43, మయాంక్ అగర్వాల్ 49 పరుగులు చేయగా కెప్టెన్ హనుమ విహారి 22 పరుగులు చేశాడు. 85 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రెస్ట్ ఆఫ్ ఇండియా, 75 పరుగుల తేడాలో 10 వికెట్లు కోల్పోవడం విశేషం..

255 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన సౌరాష్ట్ర, నాలుగో ఇన్నింగ్స్‌లో 79 పరుగులకి ఆలౌట్ అయ్యి 175 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ధర్మేంద్రసిన్హా జడేజా 21 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా హర్వీక్ దేశాయ్ 13, సమర్థ్ వ్యాస్ 10 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ సౌరబ్ కుమార్ 6 వికెట్లు పడగొట్టగా శామ్స్ ములానీకి 3 వికెట్లు దక్కాయి. 

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇరానీ ట్రోఫీ 2022 టోర్నీని కూడా రెస్ట్ ఆఫ్ ఇండియానే దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో మధ్యప్రదేశ్‌ని ఓడించింది రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్. అప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

click me!