IPL2022 RR vs LSG: రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీ... టేబుల్ టాప్ పొజిషన్‌కి...

Published : Apr 10, 2022, 11:42 PM IST
IPL2022 RR vs LSG: రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీ... టేబుల్ టాప్ పొజిషన్‌కి...

సారాంశం

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకున్న లక్నో సూపర్ జెయింట్స్... 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్టరీ... పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి... 

ఐపీఎల్ 2022 సీజన్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మరోసారి టేబుల్ టాప్ పొజిషన్‌కి దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న రాయల్స్, గత మ్యాచ్ పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది... 166 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి దాకా పోరాడిన లక్నో 162 పరుగులకి పరిమితై 3 పరుగుల తేడాతో ఓడింది.

ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్‌కి మొదటి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి బంతికే బౌల్డ్ అయిన కెఎల్ రాహుల్, గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి...

వన్‌డౌన్‌లో వచ్చిన కృష్ణప్ప గౌతమ్, రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు వైడ్ కావడంతో లక్నో 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. 14 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన జాసన్ హోల్డర్‌ని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు...

దీంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. దీపక్ హుడా 24 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోనీ 7 బంతుల్లో 5 పరుగులు చేసిన యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

32 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, చాహాల్ బౌలింగ్‌లో అవుట్ కాగా 15 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

7 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఛమీరాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన చాహాల్, ఐపీఎల్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు రాబట్టాడు మార్నస్ స్టోయినిస్. దీంతో ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 15 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీశాడు.  ఆ తర్వాత రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. దీంతో ఆఖరి 3 బంతుల్లో విజయానికి 14 పరుగులు కావాల్సి వచ్చింది. 

మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్, నాలుగో బంతికి కూడా పరుగులు ఇవ్వకుండా నియంత్రించడంతో ఆఖరి 2 బంతుల్లో 14 పరుగులు కావాల్సి వచ్చింది. ఐదో బంతికి స్టోయినిస్ ఫోర్ బాదినా, ఆఖరి బంతికి 10 పరుగులు కావాల్సి ఉండడంతో మ్యాచ్ రాయల్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి బంతికి సిక్స్ బాదిన స్టోయినిస్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

రియాన్ పరాగ్ కంటే ముందు అశ్విన్‌ని పంపి, రాయల్స్ సక్సెస్ సాధించగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసర ప్రయోగాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది లక్నో సూపర్ జెయింట్. మార్నస్ స్టోయినిస్ లాంటి భారీ హిట్టర్ 8వ స్థానంలో మ్యాచ్ దాదాపు చేజారిన తర్వాత క్రీజులోకి రాగా కృష్ణప్ప గౌతమ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

4 ఓవర్లలో 41 పరుగులిచ్చిన యజ్వేంద్ర చాహాల్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగలిగింది. యశస్వి జైస్వాల్‌ని తప్పించడంతో దేవ్‌దత్ పడిక్కల్, జోస్ బట్లర్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఓపెనర్లు దూకుడుగా ఆరంభించడంతో 5 ఓవర్లలో 42 పరుగులు పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

29 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కూడా అదే ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన రవిచంద్రన్ అశ్విన్, సిమ్రాన్ హెట్మయర్ కలిసి ఐదో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

కృష్ణప్ప గౌతమ్ వేసిన 16వ ఓవర్‌లో వరసగా రెండు సిక్సర్లు బాదిన రవిచంద్రన్ అశ్విన్, ఆ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు. జాసన్ హోల్డర్ వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు సిమ్రాన్ హెట్మయర్. 

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 10 బంతులు ఉండగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హెట్మయర్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

రియాన్ పరాగ్ 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేయగా ఆఖరి బంతికి ట్రెంట్ బౌల్డ్ 2 పరుగులు తీశాడు. హెట్మయర్ 36 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి 5 ఓవర్లలో 73 పరుగులు చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !