IPL2022 RR vs LSG: హెట్మయర్ హిట్టింగ్ హాఫ్ సెంచరీ... లక్నో సూపర్ జెయింట్స్ ముందు...

Published : Apr 10, 2022, 09:26 PM ISTUpdated : Apr 10, 2022, 09:32 PM IST
IPL2022 RR vs LSG: హెట్మయర్ హిట్టింగ్ హాఫ్ సెంచరీ... లక్నో సూపర్ జెయింట్స్ ముందు...

సారాంశం

LSG vs RR: లక్నో సూపర్ జెయింట్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన రాజస్థాన్ రాయల్స్... హాఫ్ సెంచరీతో రాణించిన సిమ్రాన్ హెట్మయర్... 

ఐపీఎల్ 2022 సీజన్‌ని ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్‌ మరోసారి చెలరేగిపోయింది. జోస్ బట్లర్, వాన్ దేర్ దుస్సేన్, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు ఫెయిల్ అయినా... సిమ్రాన్ హెట్మయర్ హిట్టింగ్‌తో హాఫ్ సెంచరీ చేసినా, రాయల్స్ స్కోరును 160+ దాటించాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగలిగింది. యశస్వి జైస్వాల్‌ని తప్పించడంతో దేవ్‌దత్ పడిక్కల్, జోస్ బట్లర్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఓపెనర్లు దూకుడుగా ఆరంభించడంతో 5 ఓవర్లలో 42 పరుగులు పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ శాంసన్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

29 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కూడా అదే ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన రవిచంద్రన్ అశ్విన్, సిమ్రాన్ హెట్మయర్ కలిసి ఐదో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

కృష్ణప్ప గౌతమ్ వేసిన 16వ ఓవర్‌లో వరసగా రెండు సిక్సర్లు బాదిన రవిచంద్రన్ అశ్విన్, ఆ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టాడు. జాసన్ హోల్డర్ వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు సిమ్రాన్ హెట్మయర్. 

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 10 బంతులు ఉండగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో రిటైర్ అవుట్‌గా పెవిలియన్ చేరిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హెట్మయర్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

రియాన్ పరాగ్ 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేయగా ఆఖరి బంతికి ట్రెంట్ బౌల్డ్ 2 పరుగులు తీశాడు. హెట్మయర్ 36 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 14 బంతుల్లో 14 పరుగులు చేసిన సమయంలో హెట్మయర్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగ్ ఆన్‌లో కృనాల్ పాండ్యా జారవిరిచాడు. అక్కడి నుంచి హెట్మయర్ వెనుదిరిగి చూసుకోలేదు. హెట్మయర్, అశ్విన్ హిట్టింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఆఖరి 5 ఓవర్లలో 73 పరుగులు చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !