IPL2022 MI vs KKR: తీరు మార్చుకోని ముంబై ఇండియన్స్... కీలక మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుత విజయం...

By Chinthakindhi RamuFirst Published May 9, 2022, 11:09 PM IST
Highlights

హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన ఇషాన్ కిషన్... 113 పరుగులకి కుప్పకూలిన ముంబై ఇండియన్స్... ముంబై ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు అద్భుతమే చేశారు. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్ల స్పెల్‌తో భారీ స్కోరు చేయలేక కేకేఆర్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడినా, కోల్‌కత్తా బౌలర్లు మాత్రం అదే రకమైన పర్ఫామెన్స్‌తో ముంబై ఇండియన్స్‌కి సీజన్‌లో 9వ ఓటమిని రుచి చూపించారు... 166 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో 113 పరుగులకే ఆలౌట్ అయ్యి 52 పరుగుల తేడాతో ఓడింది ముంబై... 

166 పరుగుల లక్ష్యఛేదనలో తొలి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్‌కి షాక్ తగిలింది. టిమ్ సౌథీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి షాట్ ఆడబోయిన రోహిత్ శర్మను తాకిన ఓ బంతి, నేరుగా వెళ్లి వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ చేతుల్లో వాళ్లింది...
అయితే ఫీల్డ్ అంపైర్ బ్యాటుకి తగల్లేదనే ఉద్దేశంతో నాటౌట్‌గా ప్రకటించాడు. 

కేకేఆర్ డీఆర్‌ఎస్ తీసుకోగా టీవీ రిప్లైలో రోహిత్ బ్యాటుకి తగలడానికి ముందే స్పైక్ కనిపించింది. చాలాసేపు దాన్ని గమనించిన థర్డ్ అంపైర్, బ్యాటుకి బాల్ తగలడం వల్లే స్పైక్ వచ్చిందనే నిర్ణయానికి వచ్చి అవుట్‌గా ప్రకటించాడు...
 
రోహిత్ అవుటైన కొద్దిసేపటికే తిలక్ వర్మ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి 32 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. 

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన రమన్‌దీప్ సింగ్ 16 బంతుల్లో 12 పరుగులు చేసి ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. 43 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ అవుటయ్యే సమయానికి ముంబై ఇండియన్స్‌కి 35 బంతుల్లో 66 పరుగులు కావాలి...

అదే ఓవర్‌లో డానియల్ సామ్స్ కూడా వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మురుగన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్, ఆ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై ఇండియన్స్‌ని కష్టాల్లోకి నెట్టేశాడు.   

17వ ఓవర్‌ ఆఖరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి కుమార్ కార్తీకేయ రనౌట్ కాగా 15 పరుగులు చేసిన పోలార్డ్, బుమ్రా వెంటవెంటనే రనౌట్ కావడంతో 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది ముంబై ఇండియన్స్... 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165  పరుగుల స్కోరు చేసింది. జస్ప్రిత్ బుమ్రా 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ మెయిడిన్‌తో 5 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు. 

click me!