IPL2022 CSK vs RR: మొయిన్ ఆలీ సెంచరీ మిస్... రాజస్థాన్ రాయల్స్ ముందు...

By Chinthakindhi RamuFirst Published May 20, 2022, 9:22 PM IST
Highlights

93 పరుగులు చేసి అవుటైన మొయిన్ ఆలీ, ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు... అయినా భారీ స్కోరు చేయలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడుతున్న ఆఖరి మ్యాచ్‌లో మొయిన్ ఆలీ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన మొయిన్ ఆలీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడినా 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగలిగింది. రుతురాజ్ గైక్వాడ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. డివాన్ కాన్వే, మొయిన్ ఆలీ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డి వాన్ కాన్వే సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేస్తుంటే మొయిన్ ఆలీ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో 4, 4, 6, 4తో 18 పరుగులు రాబట్టిన మొయిన్ ఆలీ, అశ్విన్ వేసిన 5వ ఓవర్‌లో 4, 4, 6 బాది 16 పరుగులు రాబట్టాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో 6, 4, 4, 4, 4,4 లతో ఏకంగా 26 పరుగులు రాబట్టుకున్నాడు మొయిన్ ఆలీ...

మొయిన్ ఆలీ విధ్వంసంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 75 పరుగులు చేసింది సీఎస్‌కే. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డివాన్ కాన్వే, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో ఈ పార్టనర్‌షిప్‌కి బ్రేక్ పడింది...

ఆ తర్వాతి ఓవర్‌లో ఎన్‌ జగదీశన్ 1 పరుగు చేసిన ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, 3 పరుగులు చేసిన అంబటి రాయుడు, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్‌తో పాటు జేమ్స్ నీశమ్ క్యాచులు డ్రాప్ చేయడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎమ్మెస్ ధోనీ... 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 

ఆ తర్వాతి బంతికే మొయిన్ ఆలీ కూడా అవుట్ అయ్యాడు. 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు... 

మొయిన్ ఆలీ క్యాచ్‌లో ఈ సీజన్‌లో 15 క్యాచులు పూర్తి చేసుకున్నాడు రియాన్ పరాగ్. ఒకే సీజన్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్‌గా కొత్త రికార్డు క్రియేట్ చేశాడు పరాగ్. ఇంతకుముందు 2021, 2015 సీజన్లలో 13 క్యాచులు అందుకున్న రవీంద్ర జడేజా రికార్డును అధిగమించాడు రియాన్ పరాగ్... 

6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 75 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, మిగిలిన 14 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోవడం విశేషం. 8వ ఓవర్ తర్వాత 45 బంతుల పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు...

click me!