IPL2021 MI vs PBKS: నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్... పోలార్డ్ సరికొత్త రికార్డు...

By Chinthakindhi RamuFirst Published Sep 28, 2021, 8:26 PM IST
Highlights

48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్... కృనాల్ పాండ్యా ఖాతాలో మరో రికార్డు... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కిరన్ పోలార్డ్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదరగొడుతోంది. టాస్ గెలిచి, పంజాబ్ కింగ్స్‌కి బ్యాటింగ్ అప్పగించాడు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ...

మయాంక్ అగర్వాల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్ సింగ్, కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 14 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన మన్‌దీప్ సింగ్‌ని, కృనాల్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...

కృనాల్ పాండ్యాకి ఐపీఎల్‌లో ఇది 50వ వికెట్... ఐపీఎల్‌లో కలీస్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, ఇర్ఫాన్ పఠాన్, రస్సెల్, జడేజా, పోలార్డ్ తర్వాత 1000+ పరుగులు, 50 వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు కృనాల్ పాండ్యా...

ఆ తర్వాతి ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కిరన్ పోలార్డ్... బంతితో మ్యాజిక్ చేశాడు. యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌ను 1 పరుగుకే పెవిలియన్ చేర్చిన పోలార్డ్, ఆ తర్వాత రెండో బంతికి కెఎల్ రాహుల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు.

కిరన్ పోలార్డ్, ఐపీఎల్ చరిత్రలో క్రిస్‌‌గేల్‌ను అవుట్ చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2012 బీబీఎల్‌ను పోలార్డ్ బౌలింగ్‌లో అవుటైన క్రిస్ గేల్, మళ్లీ ఇన్నాళ్లకు తన విండీస్ టీమ్‌మేట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

22 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, పోలార్డ్ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...  కెఎల్ రాహుల్ వికెట్‌తో టీ20ల్లో 300 వికెట్లు పూర్తిచేసుకున్నాడు కిరన్ పోలార్డ్...
టీ20 ఫార్మాట్‌లో 10వేలకు పైగా పరుగులు, 300 వికెట్లు తీసుకున్న మొట్టమొదటి ఆల్‌రౌండర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు కిరన్ పోలార్డ్...

కెఎల్ రాహుల్ అవుటైన తర్వాత నికోలస్ పూరన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్...

click me!