IPL2021 CSK vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్.. బిగ్ ఫైట్ లో విజేత ఎవరో..?

By team teluguFirst Published Oct 15, 2021, 7:09 PM IST
Highlights

IPL2021 Final Live: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-14 సీజన్ ముగింపునకు చేరింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో  టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్ నెగ్గగా.. కోల్కతా నైట్ రైడర్స్ రెండు సార్లు ట్రోఫీ గెలిచింది. 

ఐపీఎల్ (IPL) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రెండంచెల్లో జరిగిన సీజన్ ముగింపు దశకు చేరుకున్నది. రెండు దశల్లో సాగిన ఈ మెగా ఈవెంట్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super Kings) , కోల్కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) మధ్య కీలక పోరు జరుగుతున్నది. ఈ బిగ్ ఫైట్ లో టాస్ గెలిచిన కోల్కతా (KKR) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే  సీఎస్కే (CSK) మూడు ట్రోఫీలు నెగ్గి నాలుగో దానిమీద కన్నేయగా.. రెండు సార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్కతా.. మూడోసారి గెలిచి చెన్నైకి షాకివ్వాలని చూస్తున్నది. ఈ కీలక పోరు కోసం ఇరు జట్లలో మార్పులేమీ చేయలేదు.

ఐపీఎల్ లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 27 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ధోని (MS Dhoni) నేతృత్వంలోని చెన్నై.. 17 మ్యాచుల్లో గెలిచింది. కోల్కతా 9 మ్యాచ్ లు నెగ్గింది. ఇక యూఏఈలో జరిగిన 3 మ్యాచ్ లలో కూడా చెన్నైదే ఆధిపత్యం. ఇరు జట్లు ఇక్కడ మూడు సార్లు తలపడగా.. చెన్నై 2, కేకేఆర్ 1 మ్యాచ్ గెలిచాయి. లీగ్ దశలో ఈ జట్ల మధ్య జరిగిన పోరులో రెండు సార్లు కోల్కతాకు ఓటమి తప్పలేదు. 

ఇది కూడా చదవండి: T20 World Cup: నువ్వు కాకుంటే నాకు చాలా మంది వికెట్ కీపర్లున్నారు.. రిషభ్ పంత్ కు విరాట్ కోహ్లి వార్నింగ్

బలాబలాల విషయంలో రెండు జట్లలోనూ మెరుపులు మెరిపించే ఆటగాళ్లు, అనుభవజ్ఞులు, హిట్లర్లు ఉన్నారు. బ్యాటింగ్ లో చెన్నై తరఫున రుతురాజ్ గైక్వాడ్, డూప్లెసిస్ అదరగొడుతున్నారు. ఫైనల్ లో కూడా వారిమీదే చెన్నై ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్ లో రాబిన్ ఊతప్ప గత మ్యాచ్ లో అదరగొట్టాడు. మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోని ఎంత మేరకు రాణిస్తారో చూడాలి. మరోవైపు కోల్కతాలో కూడా వెంకటేశ్ అయ్యర్, శుభమన్ గిల్, నితిశ్ రాణా మెరపులు మెరిపిస్తున్నారు.

బౌలింగ్ లో మాత్రం కోల్కతాదే పైచేయిగా ఉంది. ఆ జట్టుకు వరుణ్, షకీబ్, నరైన్ పెద్ద బలం. ఈ సీజన్ లో కోల్కతా ఫైనల్ కు చేరిందంటే వాళ్ల బౌలింగే కారణమని చెప్పడంలో సందేహమే లేదు. పేస్ బౌలింగ్ లో ఫెర్గూసన్, శివమ్ మావి కూడా ఇరగదీస్తున్నారు. కానీ చెన్నైలో మాత్రం జడేజా, అలీ స్పిన్ భారాన్ని మోస్తున్నా కోల్కతా స్పిన్ త్రయమంతా ప్రభావం చూపడం లేదు. 

జట్లు: 
చెన్నై సూపర్ కింగ్స్ :
ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ , డుప్లెసిస్, రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హెజిల్వుడ్

కోల్కతా నైట్ రైడర్స్ : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితిష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి 

click me!