IPL2021 CSKvsSRH: వార్ వన్‌సైడ్... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సీఎస్‌కే ఈజీ విక్టరీ...

By Chinthakindhi RamuFirst Published Sep 30, 2021, 11:08 PM IST
Highlights

ఆరు వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం... ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు ఆవిరి..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వచ్చిన విజయం కేవలం గాలివాటు విజయమేనని నిరూపిస్తూ, సీఎస్‌కే చేతుల్లో చిత్తుగా ఓడి, ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ముగించకుండా కాపాడుకోవడం కూడా కష్టమే..

135 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు మరోసారి భారీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 75 పరుగులు జోడించారు రుతురాజ్, డుప్లిసిస్... ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొడుతున్న సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ ఇద్దరూ కూడా 400+ పరుగులు పూర్తిచేసుకున్నారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 591+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్... సీఎస్‌కే తరుపున ఒకే సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచారు... మైక్ హుస్సీ, సురేష్ రైనా 2013లో 587 పరుగులు జోడించగా.. రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ జోడీ ఆ రికార్డును అధిగమించి టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఇద్దరికీ ఇంకా కనీసం ఐదు మ్యాచులు మిగిలి ఉండడం విశేషం..

38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 17 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సురేష్ రైనా మూడు బంతుల్లో 2 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

అదే ఓవర్‌లో 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు జాసన్ హోల్డర్... ఆ తర్వాత అంబటి రాయుడు, ఎమ్మెస్ ధోనీ కలిసి లాంఛనాన్ని ముగించారు. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో భువీ వేసిన 19వ ఓవర్‌లో అంబటి రాయుడు సిక్సర్, ధోనీ ఫోర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి... ఆఖరి ఓవర్ మొదటి మూడు బంతుల్లో ఒక్క పరుగు వచ్చినా, మాహీ సూపర్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు...

click me!